logo

పాలమూరులో వర్ష బీభత్సం

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలితో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.

Published : 25 May 2024 05:41 IST

నేలకొరిగిన భారీ వృక్షాలు..విద్యుత్తు సరఫరాకు అంతరాయం

క్లాక్‌టవర్‌ కూడలిలో సాయంత్రం 6.30 గంటలకు కురుస్తున్న వర్షం

పాలమూరు పురపాలకం, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలితో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. 6.30 గంటల నుంచి అరగంట పాటు కురిసిన వర్షం, గాలిదూమారంతో క్లాక్‌టవర్‌ కూడలి నుంచి ఎస్‌బీఐ ప్రధాన శాఖకు వెళ్లే రహదారిపై గొల్డెన్‌ హోటల్‌ ముందు భారీ వృక్షం విరిగి పడింది. వర్షం వల్ల వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎవరికీ ప్రమాదం వాటిల్లలేదు. జిల్లా ఎస్పీ కార్యాలయం రహదారిలో, పాత బస్టాండ్‌ కూడలిలోనూ రెండు చోట్ల భారీ వృక్షాలు విరిగి రోడ్డుపై అడ్డంగా పడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోనప్పగుట్ట వెళ్లే అంతర్గత రహదారిలోనూ ఒక వృక్షం విరిగిపడింది. తెలంగాణ కూడలి నుంచి రైల్వే స్టేషన్‌ వెళ్లే మార్గంలో కిరాణ దుకాణం ఎదుట కూడా భారీ వృక్షం విరిగిపడింది. నాలుగు చోట్ల భారీ వృక్షాలు విరిగి సమీప విద్యుత్తు తీగలపై పడడంతో క్లాక్‌టవర్, పాతబస్టాండు, తెలంగాణ కూడలి, రైల్వే స్టేషన్, ఆకుల చౌరస్తా, బండ్లగేరి, వన్‌టౌన్‌ ఏరియా ప్రాంతాల్లో రెండు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పురపాలిక పారిశుద్ధ్య సిబ్బంది రహదారులపై విరిగిపడ్డ వృక్షాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. తీగలు తెగిపడిన ప్రాంతాల్లో ట్రాన్స్‌కో లైన్‌మెన్లు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి విద్యుత్తు సరఫరాను మెరుగుపరిచారు. 

తెలంగాణ కూడలిలో చెట్టు విరిగి తెగిన విద్యుత్తు తీగలను పునరుద్ధరిస్తున్న సిబ్బంది

అంధకారంలో గ్రామాలు

మహబూబ్‌నగర్‌ గ్రామీణం : మహబూబ్‌నగర్‌ మండలంలోని అలీపూర్, ధర్మాపూర్, చౌదర్‌పల్లి, బొక్కలోనిపల్లి, కోటకదిర, మాచన్‌పల్లి, పోతన్‌పల్లి గ్రామాలు శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అంధకారంలో మగ్గాయి. సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవటంతో చాలా చోట్ల వృక్షాలు విరిగి స్తంభాలపై పడ్డాయి. ఎక్కడికక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అలీపూర్‌ సమీపంలోని సబ్‌స్టేషన్‌కు, పాలమూరు యూనివర్శిటీకి మధ్య మూడు స్తంభాలు నేలకూలడంతో అలీపూర్‌తో పాటు ధర్మాపూర్, చౌదర్‌పల్లి, బొక్కలోనిపల్లి గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రాయచూర్‌ రహదారి పొడవునా చాలా చోట్ల భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. మాచన్‌పల్లి గ్రామంలో సబ్‌స్టేషన్‌ మార్గంలోనూ రెండు విద్యుత్తు స్తంభాలు కూలడంతో మాచన్‌పల్లితో పాటు పోతన్‌పల్లి, కోటకదిర గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. నాలుగు గంటలుగా విద్యుత్తు శాఖ ఏఈలు, లైన్‌మెన్లు క్షేత్రస్థాయిలో మరమ్మతులు చేస్తున్నా విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్మాపూర్‌లో శుక్రవారం బొడ్రాయి పండుగ నిర్వహించారు. ఉన్నట్టుండి సాయంత్రం నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో గ్రామంలో అంధకారంలోనే పండుగను నిర్వహించుకోవాల్సి వచ్చింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని