logo

మూడేళ్లలో మూడోసారి...!

ఇది మహబూబ్‌నగర్‌లోని విలువైన ప్రాంతమైన భగీరథ కాలనీ. నూతన కలెక్టరేట్, బైపాస్‌ రోడ్డు నిర్మించటం, భూత్పూర్‌ రోడ్డును జాతీయ రహదారిగా మార్చటంతో ఇక్కడి భూముల ధరలు పెరుగుతున్నాయి

Updated : 25 May 2024 06:27 IST

భూముల విలువ పెంపునకు రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు 

ఇది మహబూబ్‌నగర్‌లోని విలువైన ప్రాంతమైన భగీరథ కాలనీ. నూతన కలెక్టరేట్, బైపాస్‌ రోడ్డు నిర్మించటం, భూత్పూర్‌ రోడ్డును జాతీయ రహదారిగా మార్చటంతో ఇక్కడి భూముల ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇక్కడి గజం భూమి విలువ రూ.2,100 ఉంది. ఇది రూ.10వేలకు పెరిగే అవకాశముంది.

న్యూస్‌టుడే, పాలమూరు : అనేక హామీలు అమలు చేయాల్సి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రభుత్వ ఖజానాకు ఎక్సైజ్‌ శాఖతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే అత్యధిక ఆదాయం సమకూరుతోంది. మరింత ఆదాయం సమకూర్చుకునేందుకు ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే మద్యం పాలసీపై కసరత్తు చేస్తోంది. మరో వైపు స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ఇదే స్థాయిలో కసరత్తు చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు భారీగా ఉన్నా ప్రభుత్వ మార్కెట్‌ విలువలు తక్కువగా ఉన్నాయని, సవరిస్తే రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెంచుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వాటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.240 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని గణనీయంగా వృద్ధి చేసుకునే దిశగా ప్రభుత్వం భూముల విలువలు పెంచే అవకాశముంది. 

మహబూబ్‌నగర్‌ : రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద క్రయ విక్రయదారులు

కొనుగోలుదారులకు భారమే..

భారాస ప్రభుత్వం రెండు సార్లు భూముల విలువలు పెంచింది. మొదటిసారి 22.07.2021న, చివరగా 01.02.2022లో భూముల విలువలు పెంచింది. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, కల్వకుర్తి, జడ్చర్ల, కొత్తకోట, నాగర్‌కర్నూల్, అలంపూర్, పెబ్బేరు, భూత్పూర్, రాజాపూర్, బాలానగర్, అడ్డాకుల, మూసాపేట, మానవపాడు, మక్తల్, దేవరకద్ర, కోస్గి తదితర ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములకు గజం విలువ 2021లో కనిష్ఠంగా రూ.300లకు, గరిష్ఠంగా రూ.2,500లకు వరకు పెరిగింది. 2022లో గజం భూమి విలువ కనిష్ఠంగా రూ.500లకు, గరిష్ఠంగా రూ.3,500లకు పెరిగింది. ఈసారి కనిష్ఠంగా రూ.1,000లకు, గరిష్ఠంగా రూ.5వేలకు పెరిగే అవకాశముంది. పట్ణణాల్లోని ప్రధాన రహదారి మార్గాల్లో, డిమాండ్‌ బాగా ఉన్న ప్రాంతాల్లో గజం విలువ 2021లో కనిష్ఠంగా రూ.3వేలకు, గరిష్ఠంగా రూ.10వేలకు పెరిగింది. 2022లో కనిష్ఠంగా రూ.4,250లకు, గరిష్ఠంగా రూ.13వేలకు పెరిగింది. ఈసారి ప్రభుత్వం సవరిస్తే గజం భూమి విలువ కనిష్ఠంగా రూ.10వేలకు, గరిష్ఠంగా రూ.20వేలకు పెరిగే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్‌ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదే జరిగితే స్థిరాస్తి వ్యాపారంపై ప్రభావం, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసే వారిపై భారం పడే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా త్వరలో భూముల మార్కెట్‌ విలువలు సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని