logo

దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు

దైవదర్శనానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగిస్తూ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన విషాద ఘటన చోటు చేసుకుంది.

Published : 25 May 2024 05:55 IST

ఎదురెదురుగా వాహనాలు ఢీకొని ఇద్దరి దుర్మరణం

పల్లె శ్రీకాంత్                            బండమీది బాబు

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, భూత్పూర్, న్యూస్‌టుడే : దైవదర్శనానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగిస్తూ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన విషాద ఘటన చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణా ఎస్సై విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. భూత్పూర్‌ మండలం మద్దిగట్లకు చెందిన బంధువులు పల్లె శ్రీకాంత్‌(25), బండమీది బాబు(50) కలిసి ద్విచక్రవాహనంపై కర్ణాటక రాష్ట్రం యాద్గిరి జిల్లా మైలారంలోని పుణ్యక్షేత్రానికి వెళ్లి ఇంటిదేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరిగి వస్తుండగా శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ మండలం ధర్మాపూర్‌ సమీపంలో వీరి ద్విచక్రవాహనం, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాబు అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామీణ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న శ్రీకాంత్‌ను ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అల్‌ మదీనా బీఈడీ కళాశాల సమీపానికి రాగానే అతడు కూడా చనిపోయాడు. ఇరువురి మృతదేహాలను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యుల, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకొని బోరున విలపించారు. హైదరాబాద్‌లో కారు నడుపుతూ జీవనం సాగించే శ్రీకాంత్‌కు రెండు నెలల క్రితమే వివాహమైంది. అంతలోనే మృత్యువాత పడటం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. గొర్రెలు మేపుతూ జీవనం సాగించే బాబుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అతడి మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదానికి అధిక వేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఆయన చెప్పారు.


మహిళ దారుణ హత్య 

భూత్పూర్, న్యూస్‌టుడే : భూత్పూర్‌ పురపాలిక పరిధి అమిస్తాపూర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ గ్రామీణ మండలం గాజులపేటకు చెందిన ఓ మహిళ(32) దినసరి కూలీగా పనిచేస్తోంది. పాలమూరు - భూత్పూర్‌ రోడ్డులోని సాక్షి గణపతి ఆలయ సమీపంలో బేస్‌మెంట్‌ నిర్మించిన స్థలంలో శుక్రవారం ఉదయం ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని వ్యక్తులు మహిళ గొంతు కోసి ముఖంపై రాయితో కొట్టారు. తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలం వద్ద లభించిన ఆధారాలను బట్టి అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తితో కలిసి మహబూబ్‌నగర్‌ వైపు ఆమె నడిచి వెళ్తున్న దృశ్యాలు అమిస్తాపూర్‌ వద్ద సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. మహిళతో కలిసి వచ్చిన వ్యక్తి ఎవరు, వీరిద్దరు ఎక్కడెక్కడికి వెళ్లారు, హత్య ఎవరు చేశారనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలాన్ని భూత్పూర్‌ సీఐ రామకృష్ణ, ఎస్సై శ్రీనివాసులు పరిశీలించారు. వార్డు అధికారి చంద్రశేఖర్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. హతురాలుకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని