logo

మార్పు రావాలి... మన కాలేజీ మెరవాలి

ప్రభుత్వ కళాశాలల్లో వానాకాలం చదువులేనన్న భావన అందరిలో ప్రబలిపోయింది. ప్రైవేటులో విద్య ఖరీదు అయినా అన్నీ తెగనమ్ముకుని సామాన్య జనం పిల్లలను చదివిస్తున్నారు.

Updated : 25 May 2024 06:26 IST

గుండుమాల్‌లోని ఆదర్శ కళాశాల 

ప్రభుత్వ కళాశాలల్లో వానాకాలం చదువులేనన్న భావన అందరిలో ప్రబలిపోయింది. ప్రైవేటులో విద్య ఖరీదు అయినా అన్నీ తెగనమ్ముకుని సామాన్య జనం పిల్లలను చదివిస్తున్నారు.  సర్కారు కళాశాలల్లో మార్పు వచ్చింది. అనేక వసతులు సమకూరాయి. ప్రైవేటుకు దీటుగా పోటీపడటానికి ఈ ఏడాది సన్నద్ధమవుతున్నాయి. ఈ సంవత్సరం పది ఫలితాలు ఔరా! అనిపించాయి. పాలకులు, అధికారులు సమాజానికి మంచి చేయాలనే దృక్పథంతో కలిసి కదిలితే ప్రభుత్వ కళాశాలలు తప్పకుండా మెరుస్తాయి. 

న్యూస్‌టుడే, కోస్గి : మన తాతతండ్రుల నుంచి ఇప్పటి నడివయస్కుల వరకు మెజారిటీ వ్యక్తులు ప్రభుత్వ కళాశాలల్లో చదివినవారే.  అక్కడ చదివి ఉన్నత స్థానాలకు అధిరోహించినవారిని ఎంతోమందిని మనం చూస్తూనే ఉన్నాం.  ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారు ఆర్థిక భారం నుంచి విముక్తి కావడమే కాకుండా ఎన్నో సౌకర్యాలు పొందొచ్చు.

అన్నీ ఉచితమే..!: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తున్నారు. కొంతకాలంగా ఎంసెట్‌ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ స్టడీ మెటీరియల్‌ అందిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇక్కడ బోధించే అధ్యాపకులు సుశిక్షితులు. చిన్న ప్రైవేటు కళాశాలలకూ వేలాది రూపాయలు చెల్లించే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కళాశాలల్లో విశాలమైన గదుల్లో బోధన జరుగుతుంది. విద్యార్థులకు తగిన గాలి, వెలుతురు అందడంతో విటమిన్‌-డీ వంటి సమస్యలు ఎదురుకావు. 

ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ  : ప్రభుత్వ కళాశాలల్లో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ నిర్వహిస్తారు. వీటిలో స్వచ్ఛందంగా పనిచేయడం వల్ల విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు అలవడతాయి. క్యాంపులు వెళ్లి వివిధ వర్గాల ప్రముఖులను కలిసే అవకాశం కలుగుతుంది. ఈ సర్టిఫికెట్లు ఉన్న విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఉద్యోగాలలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.  

ఇదిగో ఆదర్శం 

  • నారాయణపేట జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తన కుమారుడిని జిల్లా కేంద్రంలోని అంగన్వాడీ ప్రీస్కూల్‌లో చేర్పించారు. తన చర్యద్వారా ప్రజల్లో ప్రభుత్వ సంస్థలపై నమ్మకాన్ని పెంచారు.
  • కోస్గి మండలం మీర్జాపూర్‌ గ్రామానికి చెందిన జగన్నాథ్‌రెడ్డి ప్రభుత్వ కాలేజీల్లో చదివారు. డీఈవోగా, ఆర్జేడీ, అదనపు డైరెక్టరు, ఎన్‌సీఆర్టీ సంచాలకులుగా పనిచేశారు. 
  • కోస్గికి చెందిన మిడిదొడ్డి వెంకటేశ్వర్లు స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదువుకున్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని తుమకూర్‌ యూనివర్సిటీ వీసీగా పనిచేస్తున్నారు. అంతకుముందు గుల్బర్గా , శ్రీమొగ్గ యూనివర్సిటీలలో ఆచార్యులుగా పనిచేశారు.

ఆటలకు వేదిక 

ప్రభుత్వ కళాశాలల్లో ఆటలకు స్థానం కల్పిస్తారు. విద్యార్థుల్లో మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుంది. ఇక్కడి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. విశాలమైన మైదానాలు ఉంటాయి. అన్ని వర్గాల విద్యార్థులు ఉండటం, ప్రకృతితో మమేకం అవుతూ చదవడం వల్ల ఆత్మస్థైర్యం ఇక్కడి పిల్లలకు అలవడుతుంది. 

స్వేచ్ఛగా చదువుతారు: ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఒత్తిడి ఉండదు. స్వేచ్ఛగా చదువుకోగలుగుతారు. మార్కుల ఒత్తిడి లేనప్పుడే సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. టీ-శాట్‌ ద్వారా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలు నేర్పుతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివేవారు మానసికంగా దృఢంగా ఉంటారన్నది నా అభిప్రాయం. 
పూదత్తు కృష్ణమోహన్, సైకాలజిస్టు, జడ్చర్ల


నిష్ణాతులైన అధ్యాపకులు 

ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన సుశిక్షుతులైన అధ్యాపకులు బోధిస్తారు. బాగా చదివి, పోటీ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాకే అధ్యాపక వృత్తికి వస్తున్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలి. మార్కులే కొలమానంగా బట్టీలకు ఇక్కడ తావుండదు. మానసిక ఒత్తిళ్లు,  ఇబ్బందులు ఉండవు.

అధికారులూ దృష్టిపెట్టాలి

పదో తరగతిలో చక్కని ఫలితాలను సాధించిన ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు సవాలు విసిరాయి. ఇంటర్‌లో ఫలితాలు కొంత తక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా సవాలుగా తీసుకుని ప్రభుత్వ కళాశాలలపై దృష్టిపెట్టాలి.వీటిని మరింతగా సంస్కరిస్తే మధ్యతరగతి వర్గాలవారు పిల్లల చదువుల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి ఉండదు. ప్రవేశం పొందిన తొలి రోజు నుంచే వైద్యవిద్య, ఎంసెట్‌ ప్రత్యేక శిక్షణ అందించాలి. తరచూ పోటీ పరీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లా ఫలితాల్లో జూలు విదిల్చితే సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వ కాలేజీలపై నమ్మకం కలుగుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు