logo

డబ్బులు దండి... తీరిక లేదండీ

గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి, గ్రామాలకు సామాజిక ఆస్తులు సమకూర్చే గొప్ప పథకం ఉపాధి హామీ.  భూగర్భజలాల పెంపు, వర్షం నీరు వృథా కాకుండా ఎక్కడికక్కడ ఇంకించడం, మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్రత, వివిధ శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Updated : 25 May 2024 06:25 IST

మరికల్‌ మండలం మాద్వార్‌లో నిలిచిన పంచాయతీ భవనం పనులు 

 ప్రారంభం కాని ఎన్నో ఉపాధి పనులు గ్రామీణ ప్రాంతాలలో ఏ పని గురించి అడిగినా అధికారులు చెప్పే మాట ఒక్కటే...నిధుల్లేవ్‌..
 ఉపాధి హామీ పథకంలో పనులు ఆగిపోయాయి. రూ.కోట్లు మూలుగుతున్నాయి. ఎందుకు ఉపయోగించడం   లేదంటే... మాటల్లేవ్‌..

న్యూస్‌టుడే, నారాయణపేట: గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి, గ్రామాలకు సామాజిక ఆస్తులు సమకూర్చే గొప్ప పథకం ఉపాధి హామీ.  భూగర్భజలాల పెంపు, వర్షం నీరు వృథా కాకుండా ఎక్కడికక్కడ ఇంకించడం, మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్రత, వివిధ శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏటా రూ.లక్షలు ఖర్చుచేస్తున్నా ఏ ఒక్క ఏడాదీ వందశాతం పనులు కాలేదు. పుష్కలంగా నిధులున్నా వినియోగించుకోలేని దౌర్భాగ్యం నెలకొంది. 
జిల్లాలో 280 పంచాయతీల్లో 70562 జాబ్‌కార్డులు ఉన్నాయి. మొత్తం 1,11,494 మంది కూలీలు ఉన్నారు. ఇందులో ప్రస్తుతం 38916 మంది పనులకు వస్తున్నారు.  పనులు మొదలైనా పర్యవేక్షణ కొరవడి అసంపూర్తిగా నిలిచిపోతున్నాయి. చివరిలో  వదిలేయడంతో వాటికి సార్థకత లేకుండాపోతోంది. జిల్లాలో చాలా పంచాయతీ భవనాలను మధ్యలో వదిలేశారు. దీంతో పరిపాలనకు విఘాతం కలుగుతోంది.                     

సేద్యపు కుంటల నిర్మాణాలు అంతంతే..

జిల్లాలోని 13 మండలాలకు సంబంధించి 2021-2024 మధ్యకాలంలో 4400 ఫారంపాండ్‌(సేద]్యపు కుంట) పనులకు రూ.5456.07లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు వీటిలో కేవలం 2712 నిర్మాణాలు పూర్తిచేయగా మరో 683 వివిధ దశాల్లో ఉన్నాయి. 1688 నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉంది. మొత్తం ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి.

పంట కల్లాలు.. పట్టించుకోరు

వ్యవసాయ క్షేత్రాలలో మూడు రకాలైన పంట కల్లాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎస్సీ,ఎస్టీలకు వందశాతం రాయితీతో,  బీసీలు, ఇతరులు పదిశాతం చెల్లిస్తే మిగతా 90శాతం ప్రభుత్వం అందజేస్తోంది. పంటకల్లాలు నిర్మించుకున్న రైతులకు రెండు దఫాలుగా  రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారు. గత మూడేళ్ల కాలంలో అన్ని రకాల పంటకల్లాలు కలిపి 1904 పనులకు రూ.12723.35 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో కేవలం 151 నిర్మాణాలు  పూర్తిచేశారు. మూడు రకాలైన పనులలో 611 పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

పడకేసిన ఇంకుడు గుంతల నిర్మాణం..

జిల్లాలో 79443 ఇంకుడు గుంతల నిర్మాణాలకుగాను రూ.31.71 కోట్లు మంజూరయ్యాయి. కేవలం 3121 పనులు పూర్తిచేయగా రూ.5.06కోట్లు ఖర్చుచేశారు. మరో 12,659 పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.కోట్ల నిధులు మూలుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదుల నిర్మాణాలు చేపడుతున్నారు. 46  పనులు గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో రూ.99.01లక్షలు మంజూరయ్యాయి. వీటిని సమర్థంగా వినియోగించుకోలేక పోతున్నారు.

పశువుల పాకల పనులు...

అన్ని మండలాల్లో 1121 పశువుల పాకల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. రూ.633.29లక్షలు మంజూరు చేయగా 282 పనులు పూర్తిచేశారు. 296 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. చేసిన పనులకు 122.64లక్షలు ఖర్చుచేశారు. మొత్తం 578 పనులుచేపట్టగా 543 పనులు ప్రారంభించకపోవడంతో నిధులు అలాగే ఉన్నాయి.


 పనుల పూర్తికి చర్యలు

ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులన్నీ కూలీలతోనే చేయాలి. ఏటా పనుల లక్ష్యాన్ని సాధ్యమైనంత వరకు వందశాతం పూర్తయ్యేలా కృషి చేస్తున్నాం. పనులకు వచ్చే కూలీల సంఖ్య తక్కువగా ఉండటంతో లక్ష్యాన్ని చేరుకోలేపోతున్నాం..మిగిలిన ఆయా పనులను పూర్తి చేసేందుకు శాఖాపరంగా కృషి చేస్తాం. కిందిస్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. 
రాజేశ్వరి, డీఆర్డీవో, నారాయణపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని