logo

లక్ష్యం 2 లక్షల మెట్రిక్‌ టన్నులు.. సేకరణ 81 వేలే

అంతంత మాత్రమే సాగునీరు.. దీనికి తోడు తెగుళ్లు అధికమై యాసంగిలో ధాన్యం దిగుబడి భారీగా తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Published : 25 May 2024 06:12 IST

పెబ్బేరు మార్కెట్‌ యార్డులో ధాన్యం కుప్పపోస్తున్న రైతులు

పెబ్బేరు, న్యూస్‌టుడే : అంతంత మాత్రమే సాగునీరు.. దీనికి తోడు తెగుళ్లు అధికమై యాసంగిలో ధాన్యం దిగుబడి భారీగా తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ధాన్యం సేకరణ 2 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా.. కేవలం 81 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించారు. దీనిని బట్టి దిగుబడి భారీగా తగ్గినట్లు కనిపిస్తోంది. ఆత్మకూరు, మదనాపునం, కొత్తకోట మండలాల్లో అక్కడక్కడ సాగునీరు పుష్కలంగా ఉన్న రైతులు సన్న రకాలను సాగు చేసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇవ్వకుండా బయటి వ్యాపారులకు ఎక్కువ ధరకు విక్రయించారు. జిల్లా మొత్తంలో 20 వేల మెట్రిక్‌ టన్నులు వ్యాపారులకు విక్రయించినట్లు తెలుస్తోంది.

కొనుగోలు కేంద్రాలు ఇలా..

జిల్లాలో ఐకేపీ, సింగిల్‌విండోల ఆధ్వర్యంలో 211 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వీటిలో 146 కేంద్రాలను మూసివేశారు. ఇంకా 65 ఉన్నాయి. వీటిని కూడా రెండురోజుల్లో నిలిపి వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్రాలకు ధాన్యం వచ్చిన తర్వాత కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడంతో వేగవంతం చేశారు. కొన్ని చోట్ల లారీల సమస్య కారణంగా తరలింపులో ఆలస్యం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 16,794 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. వీటిలో 14,500 మంది రైతులకు వారి ఖాతాల్లో రూ.153 కోట్లు నగదు జమ చేశారు. ఇంకా 2,294 మంది రైతులకు నగదు జమ చేయాల్సి ఉంది.


నాలుగు రోజుల్లో పూర్తి చేస్తాం

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చాలా వరకు పూర్తి చేశాం. కొన్ని గ్రామాల్లో పూర్తయినా లారీల సమస్యతో అక్కడక్కడ కొంత మేరకు ఉంది. నాలుగు రోజుల్లో పూర్తి చేస్తాం. రెండురోజుల్లో మిగతా కొనుగోలు కేంద్రాలను మూసేస్తాం. నిల్వలున్న బస్తాలను లారీల్లో మిల్లులకు తరలిస్తాం. మిగిలిన రైతులకు త్వరలోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తాం.
బాలునాయక్, ఇన్‌ఛార్జి డీఎం, పౌరసరఫరాల సంస్థ

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని