logo

ఎవరి అంచనాలు వారివే

నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారాస, కాంగ్రెస్‌ పార్టీల ప్రచారం నువ్వా..

Published : 02 Dec 2023 03:01 IST

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారాస, కాంగ్రెస్‌ పార్టీల ప్రచారం నువ్వా.. నేనా అన్నట్లుగా సాగింది. నియోజకవర్గంలో తెలకపల్లి, తాడూరు, నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఐదు మండలాల్లో భారాస అధిక్యత చూపింది. దాదాపు 54వేల మెజారిటీతో భారాస అభ్యర్థి గెలిచారు. ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. భారాసలో ఉన్న ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కుమారుడు డా. కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్‌కు వెళ్లి టిక్కెట్టు తెచ్చుకొని రంగంలో నిలిచారు. కాంగ్రెస్‌లో ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి భారాసలో చేరి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఏ మండలం ఎవరికి మెజారిటీ వస్తుందనే దానిపై వారం రోజులుగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఎక్కడ నలుగురు గుమిగూడినా వీటిపైనే చర్చించుకుంటున్నారు. నాయకులు తమ ఇళ్ల వద్ద కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణతో విశ్లేషించుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన రోజే అభ్యర్థులు తమ నాయకుల ద్వారా అంచనా సమాచారం తీసుకున్నారు. ఎగ్జిట్‌పోల్‌ వివరాలను పరిశీలిస్తున్నారు. ఎవరికి ఎవరు తగ్గకుండా ఓట్లు రాబాట్టుకునేందుకు కృషి చేశారు. వలస ఓటర్లు ఎవరి వైపు నిలిచారు, ఎవరికి లాభం చేకూరుతుందనే అంచనాలు, లెక్కలు వేసుకుంటున్నారు. పట్టణ ప్రజలు ఎవరి వైపు నిలిచారనేది ఆసక్తిగా మారింది.

హామీల ప్రభావం ఎంత?

భారాస అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి డా.రాజేశ్‌రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ హామీలు ఇస్తూ ప్రచారం చేశారు. మర్రి జనార్దన్‌రెడ్డి తాను గెలిస్తే ఇంజినీరింగ్‌ కళాశాల, ఐటీహబ్‌, పాలిటెక్నిక్‌ కళాశాల, మండల కేంద్రాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పుతానని హామీలు ఇస్తూ ప్రచారం చేశారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రాజేశ్‌రెడ్డి తాను గెలిస్తే కాంగ్రెస్‌ ఇచ్చే ఆరు గ్యారంటీలపై ఎక్కువగా ప్రచారం చేశారు. అధికార పార్టీ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ప్రచారం చేశారు. ప్రజలు ఏ రకంగా తీర్పు ఇస్తారో ఒక్క రోజు వేచి చూడాల్సిందే. గ్రామస్థాయి నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో నాయకులు పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు