logo

మూడోసారి భారాస ప్రభుత్వ ఏర్పాటు ఖాయం

కాంగ్రెస్‌ పార్టీ బూటకపు సర్వేలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని భారాస కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Published : 02 Dec 2023 03:09 IST

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ పార్టీ బూటకపు సర్వేలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని భారాస కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 71 నుంచి 81 వరకు భారాస అభ్యర్థులు గెలుస్తున్నారని, మూడోసారి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. గతంలో కంటే ఎక్కువగా మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ నాయకులు గతంలో దిల్లీ నుంచి రాజకీయాలు చేసేవారని, ఇప్పుడు బెంగళూరు నుంచి చేస్తున్నారని పేర్కొన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పెట్టుబడిదారని విమర్శించారు. గెలిచే ఎమ్మెల్యేలపై వారికి నమ్మకం లేకనే బెంగళూరులో వారి కోసం హోటళ్లు బుక్‌ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పినట్లు వారి శ్రేణులు రేపు ఉదయం 8 గంటల వరకు సంబరాలు చేసుకుంటారని, ఫలితాలు వచ్చాక తమ సంబరాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేరని, కాంగ్రెస్‌లో ఉంటూనే ఎందరో కారు గుర్తుకు ఓటేశారని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రాజేశ్వర్‌ గౌడ్‌, ముడా ఛైర్మన్‌ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ యాదవ్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రహమాన్‌, నాయకులు రాజేశ్వర్‌, కృష్ణమోహన్‌, శివరాజ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని