logo

కనీస మద్దతుకు మించి ధరలు

రైతులు పండించిన సోనా రకం వరికి మంచి ధరలు లభిస్తున్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో క్వింటాలుకు రూ.3,000 మించి ధర లభిస్తుండటం విశేషం.

Published : 02 Dec 2023 03:25 IST

మహబూబ్‌నగర్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే : రైతులు పండించిన సోనా రకం వరికి మంచి ధరలు లభిస్తున్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో క్వింటాలుకు రూ.3,000 మించి ధర లభిస్తుండటం విశేషం. జడ్చర్ల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం ఏకంగా క్వింటాలుకు రూ.3,150 పలికింది. మహబూబ్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.2,970 ధర వచ్చింది. మహబూబ్‌నగర్‌ మార్కెట్‌కు 1,296, జడ్చర్ల మార్కెట్‌కు 13,680 క్వింటాళ్ల ధాన్యం వచ్చాయి. దేవరకద్రలో రూ.2,999 ధర వచ్చింది. చాలా మంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లకుండా వ్యవసాయ మార్కెట్లు, కర్ణాటకకు పంట తరలిస్తున్నారు. గడచిన వారం, పది రోజులుగా ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మరో వారం, పది రోజుల్లో కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, ఆంధ్రా, కర్ణాటక నుంచి వచ్చిన వ్యాపారులు పంట కొనుగోలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు నేరుగా కొనుగోలు చేసి కర్ణాటకకు తరలిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనూ కనీస మద్దతు ధరకు కొంటున్నా.. రైతులు అక్కడ అమ్మటం లేదు. ఇక సాధారణ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,183 కొనుగోలు చేస్తున్నారు.

అన్నదాతల్లో ఆనందం : ఎకరాలో వరి సాగు చేసిన ఒక్కో రైతుకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ఒక్కో రైతు రెండు, మూడు ఎకరాలను సాగు చేశారు. ఐదు నుంచి ఆరు ఎకరాలు వరి సాగు చేసిన ఒక్కో రైతుకు రూ.4లక్షల వరకు ఆదాయం వచ్చింది. వరి సాగు చేసిన చాలా మంది రైతులు రసాయన ఎరువులు చల్లకుండానే దిగుబడులు సాధించారు. వరి సాగు చేసిన రైతులంతా మెరుగైన ఆదాయం రావటంపై సంతోషంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 6.81 లక్షల ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు.


విత్తనం దొరకట్లే.. : యాసంగిలో నీటి వసతి ఉన్న రైతులందరూ సోనా రకం వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సోనా రకం విత్తనం కోసం రైతులంతా వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. 25 కిలోల విత్తన బస్తాను వ్యాపారులు రూ.1,250లకు అమ్ముతున్నారు. వానాకాలంలో ఇదే విత్తన బస్తా రూ.900లకు లభించింది. తెల్ల హంస రకం విత్తనం కూడా దొరకటం లేదు. తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థలోనూ ఈ రెండు రకాల విత్తనం దొరకటం లేదు. రైతులు మాత్రం దొడ్డు రకం విత్తనాలపై ఆసక్తి చూపటం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు