logo

పాలమూరులో తగ్గిన పోలింగ్‌..!

పాలమూరులో ఈ శాసనసభ ఎన్నికల్లో 79.92 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. 2018 ఎన్నికల్లో 81.94 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఓటింగ్‌ శాతం 2018 ఎన్నికలతో పోలిస్తే కొంత మేర తగ్గింది. గతంతో పోల్చుకుంటే సగటున 2.02 శాతం ఓట్లు తగ్గాయి.

Updated : 02 Dec 2023 04:12 IST

ఓటింగ్‌పై వలస ఓటర్ల నిరాసక్తి
జాబితా కూర్పులో లోపాలు కూడా కారణమే
2018తో పోలిస్తే పెరగని శాతం

ఈనాడు, మహబూబ్‌గనగర్‌: పాలమూరులో ఈ శాసనసభ ఎన్నికల్లో 79.92 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. 2018 ఎన్నికల్లో 81.94 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఓటింగ్‌ శాతం 2018 ఎన్నికలతో పోలిస్తే కొంత మేర తగ్గింది. గతంతో పోల్చుకుంటే సగటున 2.02 శాతం ఓట్లు తగ్గాయి. ఐదేళ్లకోసారి నిర్వహించే పోలింగ్‌లో కొంత శాతమైనా పాలమూరులో ఓటింగ్‌ పెరుగుతూ వస్తోంది. ఈ సారి అందుకు విరుద్ధంగా పోలింగ్‌ తగ్గడం గమనార్హం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 72.65 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. 2018లో ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చి ఏకంగా 9.29 శాతం పెరిగింది. 2018లో ఓటింగ్‌ శాతం పెరగడానికి జిల్లాల్లో ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ సారి కూడా ప్రచారం నిర్వహించినా పలు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు కొద్దిగా అటూ ఇటూ మాత్రమే వచ్చాయి. అత్యధికంగా కల్వకుర్తి నియోజకవర్గంలో 83.26 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. తక్కువగా మహబూబ్‌నగర్‌లో 70.56 శాతం ఓట్లు పడ్డాయి. 2018 ఎన్నికలతో పోలిస్తే ఏ నియోజకవర్గంలోనూ ఒక్క శాతం కూడా ఎక్కువ ఓటింగ్‌ పెరగలేదు. కొడంగల్‌, అలంపూర్‌, గద్వాల, మక్తల్‌, నారాయణపేట, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో కొద్ది శాతం మాత్రమే ఓటింగ్‌ తగ్గింది. మిగతాచోట ఓటింగ్‌ తగ్గడంతో పోలింగ్‌ శాతం పడిపోయింది. 2018లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27.31 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2023 శాసనసభ ఎన్నికల నాటికి 31.34 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఈ ఐదేళ్లలో పాలమూరులో మొత్తం 4.01లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఓటర్ల సంఖ్య పెరగడం కూడా పోలింగ్‌ శాతం తగ్గడంపై ప్రభావం చూపించింది.

ఇవీ కారణాలే..

పాలమూరులో ముంబయి, పుణె, భీమండి, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 4.20 లక్షల మంది వలస ఓటర్లు ఉన్నారు. 2018 ఎన్నికల్లో పాలమూరుకు పెద్ద ఎత్తున వలస ఓటర్లు వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సారి ఎన్నికల్లో వలస ఓటర్లు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో పోలింగ్‌ శాతం తగ్గడానికి ఓ కారణంగా భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడం, రవాణా ఖర్చులు భరించడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఓటర్లు కూడా పాలమూరుకు 2018లో బారులుదీరారు. ఈ సారి ఆ పరిస్థితి పెద్దగా కనిపించలేదు. కేవలం బస్సు ఛార్జీలు మాత్రమే ఇస్తామని, వచ్చి ఓటు వేయాలని కోరడంతో వలస ఓటర్లు ఓటింగ్‌కు ఆసక్తి చూపలేదు. ఈ సారి 50 శాతం వలస ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనలేదని అంచనా. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆశించిన స్థాయిలో తాయిలాలు ప్రకటించకపోవడంతో దూర ప్రాంతాల వలస ఓటర్లు ఓటింగ్‌కు రావడానికి సంశయించారు.


మ్మడి జిల్లాలో పలు చోట్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను తొలగించలేదు. పలు చోట్ల రెండు ప్రాంతాల్లో ఉన్న పేర్లు కూడా అలాగే ఉన్నాయి. నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన వారి ఓట్లు నియోజకవర్గ కేంద్రంతోపాటు వారి గ్రామాల్లోనూ ఉన్నాయి. వీటి తొలగింపు సక్రమంగా జరగలేదు. ఓటర్లు పెరిగినా ఓటింగ్‌ శాతం పెరగకపోవడానికి ఇదీ ఒక కారణం.

నియోజకవర్గాల్లోని గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రజలు అంతగా ఆసక్తి చూపలేదు. గ్రామాల్లో సుమారు 80 శాతానికిపైగా ఓటింగ్‌ నమోదు కాగా పట్టణాల్లో మాత్రం 60-70 మధ్యలో ఓటింగ్‌ నమోదు కావడం కూడా ఓ ప్రధాన కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని