logo

అలసి.. సొలసి.. ఆటవిడుపు

నెల రోజులపాటు పర్యటనలు, సమావేశాలు, సమాలోచనలతో బుర్ర వేడెక్కిన అభ్యర్థులు పోలింగ్‌ గురువారం పూర్తవ్వడంతో శుక్రవారం పూర్తి ఉపశమన స్థితికి వచ్చేశారు.

Updated : 02 Dec 2023 04:10 IST

న్యూస్‌టుడే, బృందం

నెల రోజులపాటు పర్యటనలు, సమావేశాలు, సమాలోచనలతో బుర్ర వేడెక్కిన అభ్యర్థులు పోలింగ్‌ గురువారం పూర్తవ్వడంతో శుక్రవారం పూర్తి ఉపశమన స్థితికి వచ్చేశారు. మొక్కులు చెల్లించుకోవడం, కుటుంబ సభ్యులతో గడపడం, సన్నిహితులు, కార్యకర్తలతో ముచ్చటించడం చేశారు. కొద్దిమంది అభ్యర్థులు ఎవరికీ అందుబాటులో లేరు.

రామ్మోహన్‌రెడ్డి (భారాస): మక్తల్‌లోని తన ఇంట్లో పూజలు నిర్వహించి, మధ్యాహ్నం నారాయణపేట ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యనాయకులతో ఎన్నికల సరళిపై చర్చించారు.


వాకిటి శ్రీహరి (కాంగ్రెస్‌): గురువారం రాత్రి మంత్రాలయం రాఘవేంద్రస్వామి క్షేత్రాన్ని దర్శించి పూజలు చేశారు. శుక్రవారం రోజంతా ఉత్సాహంతో గడిపారు వస్తున్న నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఉత్సాహపరిచారు.
మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి (భాజపా):  శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కురుమూర్తిస్వామి ఆలయాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్నారు.


నారాయణపేట

రతంగ్‌పాండురెడ్డి (భాజపా): కుటుంబ సభ్యులతో గడిపారు. పత్రికలు, టీవీలో వార్తలు చూస్తూ పరిణామాలను విశ్లేషించారు. వచ్చినవారితో ముచ్చటించారు.

చిట్టెం పర్నికరెడ్డి (కాంగ్రెస్‌):  పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ గడిపారు. తరువాత ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు.

రాజేందర్‌ రెడ్డి (భారాస): పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులతో కలసి గడిపారు.


జడ్చర్ల

అనిరుధ్‌రెడ్డి (కాంగ్రెస్‌): శుక్రవారం తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయానికి బయలుదేరారు. సాయంత్రం అక్కడి రమణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు.శనివారం వరకు ఉండి కౌంటింగ్‌ సమయానికి వస్తారు.


నాగర్‌కర్నూల్‌

మర్రి జనార్దన్‌రెడ్డి (భారాస): స్వగ్రామమైన తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లి ఉన్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడిపారు. మధ్యలో కార్యకర్తలతో ఎన్నికల తీరుతెన్నులపై మాట్లాడారు.
కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి  (కాంగ్రెస్‌): నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకున్నారు..గ్రామాల వారీగా వచ్చిన వారితో మాట్లాడారు.

వంగ లక్ష్మణ్‌గౌడ్‌ (జనసేన): నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని జనసేన కార్యాలయంలోనే ఉండిపోయారు. రాజకీయ పరిణామాలపై నాయకులతో చర్చించారు.


అచ్చంపేట

డా.వంశీకృష్ణ (కాంగ్రెస్‌): కార్యకర్తలతో కలిసి ఎన్నికల ఫలితాలపై అంచనా వేస్తూ కార్యకర్తలతో గడిపారు.

గువ్వల బాలరాజు (భారాస): ఉదయం నుంచి వస్తున్న కార్యకర్తలతో పోలింగ్‌ సరళిపై చర్చించారు. పోలింగ్‌ విధానం, ఎక్కడెక్కడ ఎలాంటి స్పందన ఉందో తెలుసుకున్నారు.

సతీశ్‌ మాదిగ (భాజపా): హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటూ గడిపారు. పెంపుడు కుక్కతో ఆడారు. టీవీ చూశౄరు.


దేవరకద్ర

జి.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్‌): నెల రోజులుగా ప్రచారంలో బిజీగా ఉన్న జి.మధుసూదన్‌రెడ్డి శుక్రవారం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లోని తన స్వగృహానికి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో అప్యయంగా పలుకరిస్తూ మాట్లాడారు.


మహబూబ్‌నగర్‌

మిథున్‌కుమార్‌రెడ్డి (భాజపా) :  సతీమణి రిషిక, ఇద్దరు కుమారులతో కలిసి శుక్రవారం విమానంలో తిరుపతి  వెళ్లారు.

వి.శ్రీనివాస్‌ గౌడ్‌ (భారాస):   జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ముగ్గురిని కలసి ధైర్యం చెప్పారు. శిల్పారామం, హెచ్‌బీ ఫంక్షన్‌ హాళ్లలో జరిగిన వివాహాల్లో పాల్గొన్నారు.

యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్‌) : బంధువు నిశ్చితార్థం వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌ వెళ్లారు. కాళీ సమయంలో పత్రికలు చదివి విశ్లేషించారు.


కొడంగల్‌

రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌): కాంగ్రెస్‌ అభ్యర్థి, పీˆసీˆసీˆ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో గడపారు. దిల్లీ పెద్దలు, రాష్ట్ర నాయకులతో సమావేశమయ్యారు. రోజంతా బిజీబిజీగా గడిపారు.

నరేందర్‌రెడ్డి (భారాస): హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్నికల అలసటతో ఇంట్లోనే సేదతీరారు. ఫోన్‌లో నియోజకవర్గ పరిస్థితి గురించి ఆరా తీశారు. పూర్తి విశ్రాంతిలో ఉండి ఎవరినీ కలవలేదు.

బంటు రమేశ్‌ (భాజపా):  ఇంట్లోనే ఉండి రోజంతా కార్యకర్తలతో సమాలోచనల్లో మునిగి తేలారు.  


కల్వకుర్తి

తల్లోజు ఆచారి (భాజపా): తలకొండపల్లికి చెందిన పార్టీ కార్యకర్త కుమారుడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తల మధ్య ఉత్సాహంగా తిరుగుతూ సందడి చేశారు.

జైపాల్‌యాదవ్‌ (భారాస): హైదరాబాద్‌లోని తన ఇంట్లో దినపత్రికలు చదువుతూ చాలాసేపు గడిపారు. కార్యకర్తలను చరవాణి ద్వారా పలకరిస్తూ పోలింగ్‌ సరళి, రాజకీయ పరిణామాలపై చర్చించారు.  

కసిరెడ్డి నారాయణరెడ్డి (కాంగ్రెస్‌): హైదారాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. వారితో కలిసి భోజనం చేసి కుటుంబ విషయాలపై చర్చించారు.


అలంపూర్‌

విజయుడు (భారాస):  విజయుడు కర్నూల్‌లోని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నివాసంలో పోలింగ్‌ సరళిపై పార్టీ, నాయకులతో చర్చించారు.

సంపత్‌కుమార్‌ (కాంగ్రెస్‌): శాంతినగర్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ అభ్యర్థి సంపత్‌కుమార్‌ ఓటింగ్‌ సరళిపై కార్యకర్తలు, మండలస్థాయి నాయకులతో సమీక్షించారు. బూత్‌ల వారీగా పరిస్థితిని తెలుసుకుని నోట్‌ చేసుకున్నారు


గద్వాల

కృష్ణమోహన్‌రెడ్డి (భారాస): ఇనాళ్లూ తీరికలేకుండా రాజకీయ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, భారాస అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఇంటి ఆవరణలో నాయకులు, స్నేహితులతో ఓటింగ్‌ సరళిపై అభిప్రాయాలు తెలుకున్నారు.

సరిత (కాంగ్రెస్‌): శుక్రవారం ఉదయం పోలింగ్‌ సరళిపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. సాయంత్రం చాలా సమయం తమ్ముడి కూతురు ఆధ్యాతో సరదాగా ఆడుకున్నారు.

శివారెడ్డి (భాజపా): మనిషి తన జీవితంలో తన ఎదుగుదలను ఎలా రూపొందించుకోవాలో అనే విషయంపై నెపోలియన్‌ హిల్‌ రాసిన పుస్తకాన్ని చదువుతూ కన్పించారు శివారెడ్డి. తనకు పుస్తక పఠనమంటే ఎంతో ఇష్టమంటున్నారు.


కొల్లాపూర్‌

బీరం హర్షవర్ధన్‌రెడ్డి (భారాస): ఉదయం నుంచి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. గెలుపు అవకాశాల గురించి చర్చించారు.

ఎల్లేని సుధాకర్‌రావు (భాజపా): పట్టణంలోని తన కార్యాలయంలో నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల వారీగా పార్టీనాయకులు, కార్యకర్తలు, ఏజెంట్లతో సమీక్షించారు. ఎన్ని ఓట్లు వస్తాయి. ఏఏ అంశాలు పనిచేస్తాయనే విషయాలు చర్చించారు.

జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్‌): పట్టణంలోని తన కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఏజెంట్లతో పోలింగ్‌ సరళిని సమీక్షించారు.  గెలుపు, ఓటములపైన చర్చించడం, కేంద్రాలలో పార్టీల వారిగా పోలింగ్‌శాతం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  


వనపర్తి

నిరంజన్‌రెడ్డి (భారాస): ఉదయమంతా విశ్రాంతి తీసుకుని సాయంత్రం పెబ్బేరు మండలం వైశాగాపూరు తదితర గ్రామాల్లో ప్రజలను కలిశారు. ఎన్నికల సరళిపై చర్చించారు.

అనుజ్ఞారెడ్డి (భాజపా):  శుక్రవారం ఇంటి వద్దనే ఉండి పోలింగ్‌ సరళి, ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపుపై పార్టీ ముఖ్య నాయకులతో చర్చిస్తూ గడిపారు. ఇతరులెవరినీ ఇంటి వద్దకు రానివ్వలేదు.

తూడి మేఘారెడ్డి (కాంగ్రెస్‌): రోజూలాగే రాజకీయాల్లోనే గడిపారు. పెద్దమందడి, శ్రీరంగాపూరు, పెబ్బేరు మండల పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని