logo

ఈసారీ నలుగురే!

శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సారి నలుగురు అభ్యర్థులు ఓట్ల లక్షాధికారులయ్యారు. 2018 ఎన్నికల్లోనూ నలుగురు అభ్యర్థులు ఈ ఫీట్‌ సాధించారు. కాకుంటే అప్పుడు సాధించిన వారు ఒక్కరూ ఈసారి ఎన్నికల్లో ఆ ఘనతను నిలుపుకోలేకపోయారు.

Published : 06 Dec 2023 05:21 IST

మారిన ఓట్ల లక్షాధికారులు

రాజోలి, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సారి నలుగురు అభ్యర్థులు ఓట్ల లక్షాధికారులయ్యారు. 2018 ఎన్నికల్లోనూ నలుగురు అభ్యర్థులు ఈ ఫీట్‌ సాధించారు. కాకుంటే అప్పుడు సాధించిన వారు ఒక్కరూ ఈసారి ఎన్నికల్లో ఆ ఘనతను నిలుపుకోలేకపోయారు.

నాడు: 2018 వనపర్తి: నియోజకవర్గంలో మొత్తం పోలైన 1.85 లక్షల ఓట్లలో నిరంజన్‌రెడ్డికి 1,11,956, సమీప ప్రత్యర్థి చిన్నారెడ్డికి 60,271 ఓట్లు పోలయ్యాయి. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో 1.68 లక్షల ఓట్లలో మర్రి జనార్దన్‌రెడ్డికి 1,02,493 ఓట్లు, నాగం జనార్దన్‌రెడ్డికి 48,139 ఓట్లు వచ్చాయి. అలంపూర్‌లో 1.79 లక్షల ఓట్లు పోలుకాగా అబ్రహంకు 1,02,105 ఓట్లు, ప్రత్యర్థి సంపత్‌కుమార్‌కు 57,426 ఓట్లు లభించాయి. గద్వాలలో 1.90 లక్షల మంది ఓటు వేయగా, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,057 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి డీకే.అరుణకు 71,612 ఓట్లు పోలయ్యాయి.

నేడు: నాడు ఆ ఘనత సాధించిన వారిలో అబ్రహంకు ఈసారి పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో ఎన్నికలకు దూరమయ్యారు. నిరంజన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. గద్వాల నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాత్రమే విజయం సాధించారు. కానీ ఆయన ఈ సారి 94,097 ఓట్లతో లక్ష మార్కును చేరలేకపోయారు.

కొత్తగా నలుగురు: తాజా ఫలితాలలో కొడంగల్‌ నియోజకవర్గం నుంచి పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి 1,06,558 ఓట్లు సాధించి గెలుపొందారు. వనపర్తి నియోజకవర్గంలో 2018 ఎన్నికలలో లక్షకు పైగా ఓట్లు భారాస పార్టీ అభ్యర్థి నిరంజన్‌రెడ్డి దక్కించుకోగా ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థి మేఘారెడ్డి 1,05,469 ఓట్లు సాధించారు. అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన చిక్కుడు వంశీకృష్ణ 1,15,337 ఓట్లు దక్కించుకున్నారు. అలంపూర్‌ నియోజకవర్గంలో రెండో సారి కూడా ఓటర్లు భారాస పార్టీకే పెద్ద ఎత్తున మొగ్గు చూపారు. భారాస అభ్యర్థిగా బరిలో ఉన్న విజయుడికి 1,03,770 ఓట్లు వేసి గెలిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు