logo

కమ్ముకున్న మేఘాలు!

మిగ్‌జాం తుపానుతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రెండు రోజులుగా ఈదురు గాలులు.. కొద్దిపాటి జల్లులు పడటం, ఆకాశం మేఘాలతో కమ్ముకోవటంతో వరి సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 06 Dec 2023 05:30 IST

హన్వాడలోని రైతు సేవా సహకార సంఘం ముందు ధాన్యంపై కవర్లు కప్పి ఉంచిన రైతులు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ వ్యవసాయం : మిగ్‌జాం తుపానుతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రెండు రోజులుగా ఈదురు గాలులు.. కొద్దిపాటి జల్లులు పడటం, ఆకాశం మేఘాలతో కమ్ముకోవటంతో వరి సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పంట కోసిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోశారు. అక్కడ కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల్లో నింపి కవర్లు కప్పారు. కొన్నచోట్ల ధాన్యం బస్తాలను వెంట వెంటనే మిల్లులకు తరలిస్తున్నారు. కొందరు రైతులు పొలాల్లోనే ధాన్యాన్ని నిల్వ చేశారు. వ్యవసాయ మార్కెట్లకు తెచ్చిన రైతులు షెడ్ల కింద ఉంచుకున్నారు. మార్కెట్లలో వ్యాపారులు మంగళవారం కూడా రోజూలాగే పంట కొనుగోలు చేశారు. తుపాను భయం నేపథ్యంలో మార్కెట్లకు ఊహంచినంతగా పంట మాత్రం రాలేదు. మార్కెట్లలో రైతులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నారు. వర్షాలు పడితే ఇబ్బందిగా ఉంటుందని, యంత్రాలు పొలాల్లోకి రాలేని పరిస్థితి ఉంటుందని కొందరు రైతులు వరికోతలు ఆపేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఎక్కడా వర్షాలు పడినట్లు సమాచారం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులను అప్రమత్తం చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు రైతులను కలిసి ధాన్యం కుప్పలపై కవర్లు కప్పి ఉంచాలని సూచిస్తున్నారు. వరికోతలు వద్దని చెబుతున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు కూడా కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. గాలి, వానలకు చెట్లు, వాటి కొమ్మలు తీగలపై పడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కింది స్థాయి సిబ్బందికి సూచిస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది.. ప్రజలు విద్యుత్తు స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.వెంకటేశ్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ రైతులు రెండు, మూడు రోజుల వరకు కోతల్ని ఆపాలని సూచించారు. కోసిన ధాన్యాన్ని షెడ్లలో దాచుకోవాలంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని