logo

పంచాయతీ భవనాలు పూర్తయ్యేనా?

గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం జనవరి నాటికి ముగుస్తుంది. కేవలం 55 రోజులు మాత్రమే ఉంది. పంచాయతీ భవనాల నిర్మాణం అప్పటిలోపు పూర్తయ్యేలా లేవు.

Published : 06 Dec 2023 05:38 IST

మరికల్‌: పెద్దచింతకుంటలో అసంపూర్తిగా పంచాయతీ భవనం

ధన్వాడ, న్యూస్‌టుడే : గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం జనవరి నాటికి ముగుస్తుంది. కేవలం 55 రోజులు మాత్రమే ఉంది. పంచాయతీ భవనాల నిర్మాణం అప్పటిలోపు పూర్తయ్యేలా లేవు. కొన్ని గ్రామాల్లో అసంపూర్తిగా పనులు ఉండగా మరికొన్ని గ్రామాల్లో అసలు ప్రారంభమే కాలేదు. చేసిన పనులకు నిధులు విడుదల కాలేదు. ప్రభుత్వం మారడంతో సర్పంచుల్లో ఆందోళన నెలకొంది.

జిల్లాకు 137 భవనాలు మంజూరు

జిల్లాలో 280 గ్రామ పంచాయతీలుండగా 2021-22లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 137 పంచాయతీలకు సొంత భవనాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రతి భవనానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.27.40 కోట్లను మంజూరు చేశారు. మార్చిలోగానే వీటి నిర్మాణాలు పూర్తి చేయాలి. కానీ సీసీరోడ్లు, పంచాయతీ భవనాలు ఒకేసారి మంజూరు కావడంతో రోడ్లను ముందుగా పూర్తి చేశారు. తర్వాత పంచాయతీ భవనాల నిర్మాణం ప్రారంభం కాగా ఇప్పటి వరకు పది శాతంలోపే పూర్తయ్యాయి. చాలా చోట్ల అసంపూర్తిగానే దర్శనమిస్తుండగా కొన్ని చోట్ల ప్రారంభం కాలేదు. ధన్వాడలోని కిష్టాపూర్‌, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఏప్రిల్‌ నెలలో శిలాఫలకాలు ఆవిష్కరించారు. కిష్టాపూర్‌లో స్థల వివాదం, రాంకిష్టాయపల్లిలో ఆసక్తి చూపకపోవడంతో నేటికి పనులు మొదలు కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.

ధన్వాడ: కిష్టాపూర్‌లో భూవివాదంతో శిలాఫలకానికే పరిమితమైన పనులు

బిల్లులు రాకపోవడంతో..

నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి సకాలంలో బిల్లులు రాకపోవడమూ ఒక కారణమని సర్పంచులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధన్వాడ మండలంలోని గోటూర్‌ గ్రామంలో మూడు నెలల కిందటే భవనాన్ని ప్రారంభించినా ఇంతవరకూ బిల్లులు రాలేదు. సొంత నిధులతో పనులు పూర్తి చేసిన సర్పంచులు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఏమ్నోన్‌పల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయినా ఇప్పటి వరకు బిల్లు రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో నిర్మాణాలను పూర్తి చేసేందుకు సర్పంచులు ఆసక్తి చూపడంలేదు.

పూర్తి చేస్తాం : ఎన్నికల నేపథ్యంలో నిర్మాణాలు ఆగిపోయాయి. పనులు జరిగిన మేరకు బిల్లులు రూపొందించి పై అధికారులకు పంపించాము. త్వరలో విడుదలవుతాయి. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేస్తాం.

నరేందర్‌ పీˆఆర్‌ ఈఈ, నారాయణపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని