logo

దొరికిన నగదు రూ.3.95 కోట్లు

అక్టోబర్‌ 9న హన్వాడ ప్రాంతానికి ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మహబూబ్‌నగర్‌ పట్టణం పాత బస్టాండు వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. వారి వద్ద లభించిన రూ.6లక్షల నగదుకు ధ్రువపత్రాలు చూపకపోవటంతో పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 06 Dec 2023 05:41 IST

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ నేరవిభాగం

జిల్లా కేంద్రంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

అక్టోబర్‌ 9న హన్వాడ ప్రాంతానికి ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మహబూబ్‌నగర్‌ పట్టణం పాత బస్టాండు వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. వారి వద్ద లభించిన రూ.6లక్షల నగదుకు ధ్రువపత్రాలు చూపకపోవటంతో పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

నవంబర్‌ 29న జిల్లా కేంద్రంలోని రైతుబజారు సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఒకరి వద్ద రూ. 1.40 లక్షలు లభ్యం కాగా ధ్రువపత్రాలు చూపలేదు. నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పంచడానికి నగదు తీసుకెళ్తున్నట్లు అనుమానించి కేసు నమోదు చేశారు.

జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎన్నికల వేళ పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నగదు, ఆభరణాలు, వస్తువులు, చీరలు, మద్యం పట్టుకున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడంతో 171 కేసులు నమోదు చేశారు. పోలీసులు, ఎన్నికల అధికారులు, ఎఫ్‌ఎస్‌టీ (ప్లయింగ్‌ స్వ్కాడ్‌ టీమ్‌), ఎస్‌ఎస్‌టీ (స్టాటిస్టిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌), ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌), వీఎస్‌టీ (వీడియో సర్వేలెన్స్‌ టీమ్‌) తదితర బృందాలు నెలన్నర పాటు విస్తృతంగా తనిఖీలు చేశాయి. మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రకటన వచ్చిన నుంచి ముగిసే వరకు ఆధారాలు లేకుండా పట్టుబడిన రూ.3.95కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నగదు వివరాలు నమోదు చేసుకొని స్క్రూటినీ అధికారులకు అప్పగించారు. పెద్ద, చిన్న వ్యాపారులు, వివిధ అత్యవసరాలకు నగదు తీసుకెళ్తున్న వారు ఆధారాలు సమర్పించటంతో స్క్రూటినీ అధికారులు రూ.3.59 కోట్లు తిరిగి ఇచ్చేశారు. మరో రూ.28లక్షలు ఓ వస్త్ర దుకాణానికి సంబంధించిన సొమ్ము కావడంతో ఐటీ అధికారులకు అప్పగించారు. డబ్బుకు సంబంధించి రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి.

1.39 లక్షల లీటర్ల మద్యం.. : జిల్లాలో అనుమతి లేకుండా సరఫరా చేస్తున్న మద్యాన్ని పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న 9,120 లీటర్ల మద్యం  విలువ రూ.44లక్షలుగా నిర్ధారించారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు 1,30,270 లీటర్ల మద్యాన్ని పట్టుకోగా, దాని విలువ రూ.3.90 కోట్లుగా నిర్ధారించారు. వీటికి సంబంధించి పోలీసులు 165 కేసులు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద 14 కేసులను నమోదు చేశారు. ఎన్నికల వేళ నెలన్నర పాటు తమ సిబ్బంది బాగా పనిచేశారని డీఎస్పీ మహేశ్‌ ‘న్యూస్‌టుడే’కు వివరించారు. రెండు కేసుల్లో మాత్రమే తమకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదన్నారు. అలాంటి వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

బంగారం 99, వెండి 302 తులాలు : జిల్లాలో జరిపిన తనిఖీల్లో 29 తులాల బంగారం, 302 తులాల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 200 గ్రాముల వెండి మినహా మిగతా బంగారు, వెండి వస్తువులను తిరిగి ఇచ్చేశారు. ఇందుకు సంబంధించి 4 కేసులు నమోదు చేశారు. 150 చీరలు, 200 టీషర్టులు, గోడ గడియారాలను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని