logo

ప్రయోగ కిట్ల జాడేది.?

విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు సైన్స్‌ పాఠాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే వాటిని ప్రయోగ పరికరాలతో బోధించడం, విద్యార్థులతో చేయించడం ప్రధానం. తద్వారా పాఠశాల నుంచే భావిభారత శాస్త్రవేత్తలుగా వారిని రూపుదిద్దడానికి అవకాశం ఉంటుంది.

Updated : 06 Dec 2023 06:06 IST

తరగతి గదిగా ఉపయోగిస్తున్న రాజోలి మండలం మాన్‌దొడ్డిలోని ప్రయోగశాల

గద్వాల న్యూటౌన్‌, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు సైన్స్‌ పాఠాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే వాటిని ప్రయోగ పరికరాలతో బోధించడం, విద్యార్థులతో చేయించడం ప్రధానం. తద్వారా పాఠశాల నుంచే భావిభారత శాస్త్రవేత్తలుగా వారిని రూపుదిద్దడానికి అవకాశం ఉంటుంది. అయితే.. ఇందుకు ప్రధానంగా ఉపకరించే సైన్సు కిట్లు రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఫలితంగా విద్యార్థులు ప్రయోగ పాఠాలకు నోచుకోవడం లేదు.

జిల్లాలో ఇలా...: జోగులాంబ గద్వాల జిల్లాలో 189 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 6వ తరగతి నుంచి 10 తరగతి వరకు సుమారు 38 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రెండేళ్ల కిందట రెండు విద్యా సంవత్సరాలు సమగ్ర శిక్షా అభియాన్‌ ద్వారా 25 రకాల సామాగ్రితో కూడిన సైన్సు కిట్లు అందించారు. వీటి ద్వారా చాలా చోట్ల విద్యార్థులకు ప్రయోగ పాఠాలు అందాయి. గత విద్యా సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు కిట్ల ప్రభుత్వం నుంచి కిట్లు అందలేదు. దీంతో విద్యార్థులు కేవలం పుస్తక పాఠాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

అసంపూర్తిగా గదుల నిర్మాణం: ప్రయోగ పాఠాలకు ప్రత్యేక గదులు అవసరమని గుర్తించిన విద్యాశాఖ 2019 అక్టోబరులో ఎస్‌ఎస్‌ఏ ద్వారా గదుల నిర్మాణానికి రూ.1.44 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసింది. 12 మండలాల పరిధిలో 16 ఉన్నత పాఠశాలలకు ప్రయోగశాల గదులు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 8 మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన చోట్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. నిర్మించిన చోట ప్రయోగ పరికరాలు లేకపోవడంతో ఆ గదులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం బడులకు వెళ్తున్న విద్యార్థులకు ప్రయోగ పాఠం అందని ద్రాక్షగానే మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

వస్తే అందిస్తాం: సైన్సు కిట్లు ఈ విద్యా సంవత్సరం కూడా రాలేదని, విద్యాశాఖ నుంచి వస్తే పాఠశాలలకు అందిస్తామని జిల్లా సైన్సు అధికారి భాస్కర్‌ పాపన్న తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని