logo

కాంగ్రెస్‌ వైపే ఉద్యోగుల మొగ్గు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు కూడా కాంగ్రెస్‌కే జై కొట్టారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వేసిన వారిలో 90 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. వీరిలో ఉపాధ్యాయులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated : 06 Dec 2023 05:51 IST

66.83 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఆ పార్టీకే..
భారాసకు 19.19, భాజపాకు 10.56 శాతం

ఈనాడు, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు కూడా కాంగ్రెస్‌కే జై కొట్టారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వేసిన వారిలో 90 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. వీరిలో ఉపాధ్యాయులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. వీరంతా ఎన్నికల విధుల్లో ఉండటంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను ఉపయోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 22,151 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదయ్యాయి. అందులో 21,141 ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. 1,010 ఓట్లు వివిధ కారణాలతో తిరస్కరించడం లేదా చెల్లుబాటు కాలేదు. ఉమ్మడి జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల నమోదు సందర్భంగా తమకు అవకాశం కల్పించలేదని పలు చోట్ల నిరసనలు జరిగాయి. అయినా కూడా మొత్తం ఓట్లలో 95.44 శాతం ఓట్లు పోలయ్యాయి. వీటిలో కాంగ్రెస్‌కు 14,130 (66.83 శాతం) ఓట్లు, భారాసకు 4,058(19.19 శాతం) ఓట్లు, భాజపాకు 2,234 (10.56 శాతం) ఓట్లు, ఇతరులకు 719(3.40 శాతం) ఓట్లు వచ్చాయి.  పోస్టల్‌ ఓట్లలో ఎక్కువగా ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరిలో మెజార్టీ శాతం కాంగ్రెస్‌కే ఓట్లు వేయడం విశేషం. పాలమూరులోని ప్రతి నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యత కొనసాగుతూ వచ్చింది. తర్వాత భారాసకు పడ్డాయి. 

అధికార వర్గాల్లో చర్చ..: పాలమూరులోని అధికార వర్గాల్లో పోస్టల్‌ ఓట్ల నమోదుపై చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తుంది. ఉపాధ్యాయుల బదిలీలు, భార్యభర్తలను వేరువేరు జిల్లాలో పోస్టింగ్‌ ఇవ్వడంపై ఉపాధ్యాయుల్లో కొంత వ్యతిరేకత ఉంది. విద్యాశాఖతోపాటు వివిధ శాఖల్లో పదోన్నతలు లేకపోవడం, సమయానికి జీతాలు రాకపోవడం వంటి కారణాలతో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. ఈ కారణాలతోనే ఉద్యోగుల ఓటు బ్యాంకు హస్తం పార్టీవైపు మళ్లిందని ఆ సంఘం నేతలే కొందరు చెబుతుండడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని