logo

నాడు బూర్గుల.. నేడు రేవంత్‌

కాంగ్రెస్‌ అధిష్ఠానం రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించడంతో పాలమూరు బిడ్డకు రెండోసారి ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఈ ప్రాంతానికి చెందిన రేవంత్‌ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Updated : 06 Dec 2023 06:54 IST

రెండోసారి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి పదవి
రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగిన ఎనుముల

ఈనాడు, మహబూబ్‌నగర్‌- అచ్చంపేట, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ అధిష్ఠానం రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించడంతో పాలమూరు బిడ్డకు రెండోసారి ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఈ ప్రాంతానికి చెందిన రేవంత్‌ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1952లో అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రానికి పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన బూర్గుల రామకృష్ణారావు సీఎంగా పని చేశారు. రేవంత్‌రెడ్డి పూర్వ మహబూబ్‌నగర్‌లోని కొడంగల్‌ నియోకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి జరిగిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం మళ్లీ వచ్చిందని పలుమార్లు ప్రస్తావించారు. నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జన్మించిన ఎనుముల రేవంత్‌రెడ్డి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు. 2021 జూన్‌లో పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జడ్పీటీసీ సభ్యుని నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదగడానికి 17ఏళ్లు పట్టింది. అతి తక్కువ సమయంలో ఆయన ఈ స్థానానికి ఎదిగారు. ఆయన ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. పాలమూరు బిడ్డగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్‌ నుంచి జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొంది రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2007లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పూర్వ మహబూబ్‌నగర్‌లోని కొడంగల్‌ నుంచి తెదేపా టికెట్‌ తెచ్చుకుని రాజకీయ కురువృద్ధుడు గురున్నాథ్‌రెడ్డిని ఓడించి మొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. 2014లో రెండో సారి కూడా తెదేపా నుంచి గెలుపొందారు. 2018లో భారాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

నల్లమల బిడ్డలను ఆశీర్వదించాలని...: 2014లో గెలుపొందిన తెదేపా ఎమ్మెల్యేలు పలువురు భారాసలో చేరారు. రేవంత్‌రెడ్డి మాత్రం తెదేపాలోనే కొనసాగారు. ఉమ్మడి జిల్లాలో తెదేపాలో ఉన్న సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి పార్టీని వీడటంతో రేవంత్‌రెడ్డి పాలమూరులో మరింత క్రియాశీలక పాత్ర పోషించారు. 2018 ఎన్నికలకు ముందు రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అగ్రనేతలు ఆయనకు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడి పదవిని కట్టబెట్టారు. 2018 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కొడంగల్‌లో ఓటమి పాలవడంతో 2019లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రేవంత్‌రెడ్డి సభలు ఎక్కడ పెట్టినా పెద్ద ఎత్తున జనం వచ్చి ఆయన ప్రసంగాలకు ఇట్టే ఆకర్షితులవుతారు. ఎన్నికల ప్రచారంలోనూ తాను నల్లమల బిడ్డనని తనను ఆశీర్వదించాలని, మరోసారి ఈ ప్రాంతానికి పాలించే అవకాశం వస్తుందని తరచూ ప్రస్తావించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుపులో రేవంత్‌దే కీలక పాత్ర. పాలమూరుకు మరోసారి సీఎం అవకాశం రావడంతో ఈ ప్రాంతవాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

వనపర్తి జిల్లా కొత్తకోటలో కాంగ్రెస్‌ నాయకుల సంబరాలు

14 నియోజకవర్గాల్లో గెలిపించాలని..: ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి తనను ఆశీర్వదించాలని ఈ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాలమూరు అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంత వ్యక్తి కీలక హోదాలో ఉంటే పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లవచ్చని ప్రసంగాల్లో పదేపదే ప్రస్తావించారు. ఆయన మాటల్ని ప్రజలు నమ్మి ఓటేశారు. మొత్తం 14 స్థానాల్లో 12 చోట్ల కాంగ్రెస్‌ను గెలిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు గెలిచిన జిల్లాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఒకటి. పాలమూరులోని ప్రతి నియోజకవర్గంలోని పలువురితో రేవంత్‌రెడ్డికి అనుబంధం ఉంది. ఆయన్ని సీఎంగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. జిల్లా కేంద్రాలు, అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. కొడంగల్‌ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు రోడ్లపైకి రావడంతో పండగ వాతావరణం నెలకొంది.

ఇంటర్‌ విద్యార్థిగా రేవంత్‌రెడ్డి..

2006లో మిడ్జిల్‌ మండల కేంద్రంలో 132/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పటి కల్వకుర్తి ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో మిడ్జిల్‌ జడ్పీటీసీ సభ్యుడి హోదాలో రేవంత్‌రెడ్డి..  కొండారెడ్డిపల్లిలో జరిగిన దసరా ఉత్సవాల్లో స్థానిక నాయకులతో..

వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని స్వగృహం


కొండారెడ్డిపల్లిలో పండగే..:  రేవంత్‌రెడ్డి సీఎంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించడంతో మా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువకులు ఆనందంలో మునిగిపోయారు. ఉమ్మడి జిల్లాలోనే వంగూరు మండలం వెనకబడింది. రేవంత్‌ సీఎం కావడంతో మండలాన్ని అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నా. 

ఎనుముల వేమారెడ్డి, గ్రామస్థుడు


సాగునీరందిస్తారని ఆశిస్తున్నా..: చిన్ననాటి స్నేహితుడు, సహచర విద్యార్థి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎనలేని సంతోషంగా ఉంది. రేవంత్‌రెడ్డి కేఎల్‌ఐలో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేసి కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో 4 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తార[ని ఆశిస్తున్నాను.

కేవీఎన్‌రెడ్డి, వంగూరు జడ్పీటీసీ సభ్యుడు


స్నేహితుడు సీఎం కావడం గర్వంగా ఉంది: వనపర్తిలో ఇంటర్మీడియటు వరకు చదువుకున్న నేను, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంచి స్నేహితులం. ఇద్దరం కలిసే చిత్రలేఖనం చేసేవాళ్ళం. రేవంత్‌ మంచి చిత్రలేఖకుడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ వారి జాగృతి వార పత్రికలో ఇద్దరం జర్నలిస్టులంగా పనిచేశాం.  నలభైఏళ్ల స్నేహంలో ఎన్నడూ తను ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా పలకరింపులు, స్నేహబంధం కొనసాగుతోంది. తోటి స్నేహితుడు కష్టపడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం స్నేహబృందానికి గర్వంగా ఉంది.

సూర్యచంద్రారెడ్డి, సర్పంచి, చిన్నమందడి, వనపర్తి జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని