logo

స్లాట్‌ రద్దయినా.. సొమ్ము రాకపాయె!

భూముల రిజిస్ట్రేషన్‌ కోసం ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులకు వింత అనుభవం ఎదురవుతోంది. ధరణి నిబంధనల ప్రకారం స్లాట్‌ను బుక్‌ చేసుకునే సమయంలో మీ సేవా కేంద్రాల్లో చెల్లిస్తున్న సొమ్ములు, స్లాట్‌ రద్దయిన పక్షంలో తిరిగి చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ అది అమలుకు నోచుకోవడం లేదు.

Published : 29 Feb 2024 04:22 IST

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: భూముల రిజిస్ట్రేషన్‌ కోసం ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులకు వింత అనుభవం ఎదురవుతోంది. ధరణి నిబంధనల ప్రకారం స్లాట్‌ను బుక్‌ చేసుకునే సమయంలో మీ సేవా కేంద్రాల్లో చెల్లిస్తున్న సొమ్ములు, స్లాట్‌ రద్దయిన పక్షంలో తిరిగి చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ అది అమలుకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వేలాది మందికి స్లాట్‌ రద్దు సొమ్ములు అందని ద్రాక్షలానే అవుతున్నాయి. భూముల క్రయవిక్రయాలు పారదర్శకంగా ఉండాలని గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను 2020లో అందుబాటులోకి తీసుకుని వచ్చింది. భూ రిజిస్ట్రేషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన రుసుములు చెల్లించి స్లాట్‌లను బుక్‌ చేసుకుంటున్నారు. అనివార్య కారణాల వల్ల స్లాట్‌ను రద్దు చేసుకున్నా, పలు కారణాలతో స్లాట్‌ రద్దయినా మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి చెల్లించిన సొమ్ములు తిరిగి రైతుల ఖాతాలో జమ కావడం లేదు. జిల్లా వాప్తంగా 12 మండలాల పరిధిలో ఇలా స్లాట్‌ బుక్‌ చేసుకున్న తరువాత రద్దయినా, సొమ్ములు తిరిగి రానివారు సుమారు 1,565 మంది ఉన్నారు. వారంతా సొమ్ముల కోసం ఎదురు చూస్తున్నారు.

ఎవరిని అడగాలో తెలియక: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం మీ సేవలో ఆయా ప్రాంతాల్లో భూమి విలువ ఆధారంగా నిబంధనల ప్రకారం రుసుము చెల్లించి ఒప్పందం ప్రకారం స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటారు. స్లాట్‌ కేటాయించిన రోజున సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో ఇరు వర్గాల సమక్షంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారు. వివిధ కారణాలతో కొంత మంది భూ రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకుంటున్నారు. కొన్నింటిని అధికారులే అనుమతించడంలేదు. వారికి ధరణి నిబంధల ప్రకారం రిజిస్ట్రేషన్‌ కోసం మీ సేవాలో స్లాట్‌ బుకింగ్‌ సమయంలో చెల్లించిన సొమ్ములను తిరిగి రైతు ఖాతాలో జమ చేయాల్సి ఉంది. అలా జరగక వాటి కోసం రైతులు తహసీల్దార్‌ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ధరణిలో భూ క్రయ విక్రయాలు నిలిచిపోయిన క్రమంలో చెల్లింపులకు సంబంధించిన వివరాలను గురించి ఎవరిని అడగాలో తెలియక స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారు తికమకపడుతున్నారు. ఎకరం భూమి రిజిస్ట్రేషన్‌కు సెల్‌ డీడ్‌కు 4 శాతం, గిప్టు డిడ్‌కు 3 శాతం రుసుము చలానా రూపంలో ప్రభుత్వ ఖాజానాకు జమ చేస్తున్నారు. అయితే చివరి క్షణంలో వారసత్వ భూముల విషయంలో సమస్యలు తలెత్తడం, మిస్సింగ్‌ సర్వే నంబర్లు ఉండటం, ఆన్‌లైన్‌లో సర్వే నంబర్లు కనిపించకపోవడం, భూమి విక్రయంపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, వ్యక్తిగత కారణాలతో చివరి క్షణంలో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోతున్న సందర్భాలున్నాయి.  మూడేళ్లుగా స్లాట్‌ రద్దయినా వారికి సొమ్ములు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చిత్రంలో కన్పిస్తున్నది ఇటిక్యాల మండలం షేక్‌పల్లికి చెందిన రైతు రాముడు. ఆయనకు స్వగ్రామంలో 11.39 ఎకరాల భూమి ఉంది. అందులో 10 ఎకరాల భూమిని తన సమీప బంధువు పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి ఖాతా మార్పు కోసం ఏడాది కిందట నిబంధనల ప్రకారం రూ.25,858 మీ సేవా కేంద్రంలో చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్నాను. కానీ మండల తహసీల్దార్‌ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయకుండా స్లాట్‌ను రద్దు చేశారు. స్లాట్‌ ఎందుకు రద్దు చేశారో తెలియడం లేదు. కాగా స్లాట్‌ బుకింగ్‌ చేసిన సమయంలో చెల్లించిన సొమ్ములు ఇంత వరకు రాలేదు.

రెవెన్యూ వారేమంటున్నారంటే..: వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుని, ఆ తరువాత రద్దు చేసుకున్న వారికి ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలోకి చలానా సొమ్ములు జమ చేస్తుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. స్లాట్‌ రద్దయిన వెంటనే సొమ్ములు తిరిగి చెల్లించడం అనే విషయంతో రెవెన్యూ శాఖకు సంబంధం లేదని, దీనిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని