logo

పుర ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ రాజీనామా

వనపర్తి పురపాలక సంఘం ఛైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ ఛైర్మన్‌ వాకిటి శ్రీధర్‌పై పెట్టే అవిశ్వాస తీర్మానం చివరకు వారి స్వచ్ఛంద రాజీనామాకు మలుపు తిరిగింది. బుధవారం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తన నివాస గృహంలో ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌తో పాటు 23 మంది భారాస కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు.

Updated : 29 Feb 2024 06:13 IST

పార్టీ కౌన్సిలర్లతో మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి, న్యూస్‌టుడే: వనపర్తి పురపాలక సంఘం ఛైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ ఛైర్మన్‌ వాకిటి శ్రీధర్‌పై పెట్టే అవిశ్వాస తీర్మానం చివరకు వారి స్వచ్ఛంద రాజీనామాకు మలుపు తిరిగింది. బుధవారం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తన నివాస గృహంలో ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌తో పాటు 23 మంది భారాస కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. భారాస కౌన్సిలర్ల మధ్య కొంత అగాధం, మనస్పర్ధలు ఏర్పడటం వలన అవిశ్వాస తీర్మానానికి పరిస్థితులు దారి తీసినట్లుగా మాజీ మంత్రి గుర్తించారు. అందరితో చర్చించాక ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌లిద్దరూ స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు ముందుకొచ్చారని భారాస వర్గాలు పేర్కొన్నాయి. ఒకసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కలెక్టర్‌కు నోటీసు ఇచ్చాక వెనక్కి తీసుకోవడం సాధ్యపడదని గుర్తించారు. మరోవైపు స్వచ్ఛంద రాజీనామాపైన తమకు నమ్మకం లేదని, ఇన్ని దఫాలుగా జరిగిన సమావేశాలలో ఇదే చెబుతూ వచ్చారని ఇక ఏ మాత్రం నమ్మకంలేదని మెజారిటీ కౌన్సిలర్లు తేల్చి చెప్పినట్లు సమాచారం. నోటీసు ఇచ్చాక అవిశ్వాస తీర్మాన సమావేశం జరగక తప్పదు కాబట్టి, స్వపక్షం వాళ్లే అవిశ్వాస తీర్మానం పెట్టి ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్లను దింపారన్న అపఖ్యాతి నుంచి పార్టీని బతికించుకోవాలంటే ఆ రోజు సమావేశానికి భారాస కౌన్సిలర్లు గైర్హాజరు కావాలని ప్రతిపాదన వచ్చింది. అవిశ్వాసం వీగిపోయాక ఇద్దరిచే స్వచ్ఛంద రాజీనామా చేయించి మెజారిటీ కౌన్సిలర్లు కోరుకున్న వారిని ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌లుగా ఎన్నుకుందామన్న బుజ్జగింపుపై కౌన్సిలర్లు రాజీకి రాలేదు.

శిబిరానికి కౌన్సిలర్లు?

అవిశ్వాస తీర్మానం నెగ్గాక స్వపక్ష భారాసలోనే ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌లుగా ఎన్నుకోబోయే కౌన్సిలర్లు మిగతా సభ్యులతో క్యాంపు నిర్వహించనున్నట్లు సమాచారం. వీరు గురువారం బయలు దేరనున్నారని తెలిసింది. ఇప్పటికే ఒకరు మిగతా సభ్యులకు పెద్దమొత్తంలో లెక్క ముట్టజెప్పినట్లు కౌన్సిలరు వర్గాలే పేర్కొంటున్నాయి. 21 మంది కౌన్సిలర్లలో అవిశ్వాసం పెట్టాలని ఉన్నా, పెద్దాయన ముందు చెప్పలేక పోతున్నారని, వారూ తమ వెంటే ఉన్నారని మెజారిటీ సభ్యులు నొక్కి చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇన్ని సార్లు సముదాయింపులు, బుజ్జగింపులు జరిపినా కౌన్సిలర్లు ససేమిరా అనడంతో పార్టీ పరువును కాపాడుకునేందుకైనా అవిశ్వాసానికి ముందుగానే ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌లచే స్వచ్ఛందంగా రాజీనామాలు చేయించి ఆ లేఖలను సభ్యులకు చూపి వారు అవిశ్వాస తీర్మానం సమావేశానికి గైర్హాజరయ్యేలా చూడాలని నిర్ణయం తీసుకుని అవిశ్వాసం అంకానికి శాశ్వతంగా తెరవేయాలని చూస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని