logo

నిలిచిన చెక్కులు.. లబ్ధిదారులకు చిక్కులు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. వీటి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కోడ్‌ ముగిసిన వెంటనే అందజేస్తామని అధికారులు ప్రకటించారు.

Published : 29 Feb 2024 04:25 IST

న్యూస్‌టుడే, నారాయణపేట న్యూటౌన్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. వీటి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కోడ్‌ ముగిసిన వెంటనే అందజేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ సారి ఎమ్మెల్సీ కోడ్‌ ముగిసేలోగా మళ్లీ ఎంపీˆ ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉండటంతో చెక్కుల కాలం ముగుస్తుందేమోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది.

ధన్వాడ, నారాయణపేట మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు గత మంగళవారం చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేస్తామని ప్రకటించారు. ఈ విషయమై లబ్ధిదారులకు సమాచారమూ ఇచ్చారు. ఉదయం తొమ్మిది గంటలకే ఇస్తామని చెప్పడంతో ధన్వాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు రైతు వేదిక వద్దకు చేరుకొని ఎదురు చూడసాగారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్‌ అమలులోకి వచ్చిందన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అదికారులు ప్రకటించారు. చెక్కులను మళ్లీ ఇచ్చేదెపుడో సమాచారం ఇస్తామని చెప్పి తిప్పి పంపారు. నిబంధనల ప్రకారమైతే నియోజకవర్గ ప్రజాప్రతినిధి అందుబాటులో ఉంటే వారి చేతుల మీదుగా అందజేయడం సరైందే  ఒకవేళ అందుబాటులో లేకపోవడం లేదా ఇతర సమస్యలేమైనా ఎదురైతే అధికారులే చెక్కులను ఇవ్వొచ్చు. అయితే గత, ప్రస్తుత పభుత్వంలోని అధికారులు ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకొచ్చిన గొడవంటూ ఎంత ఆలస్యమైనా ప్రజాప్రతినిధులు చేతుల మీదుగానే అందజేయిస్తున్నారు. ఇదే జాప్యానికి కారణమవుతోంది.

గతంలోనూ ఇలాగే.. : శాసనసభ ఎన్నికల ముందు వచ్చిన చెక్కులను కోడ్‌ పేరున పంపిణీ చేయకుండా అలాగే ఉంచారు. ఎన్నికల తర్వాత పంపిణీ చేసేసరికి చెక్కుల కాలం తీరింది. వీటిని పునరుద్ధరించేందుకు ఒక్కొక్క లబ్దిదారుడు రూ. 600 భరించాల్సి వచ్చింది. గతానుభవాలను పరిగణలోకి తీసుకోవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా ఆలోచించలేకపోయారు. ఈ సారి ఎమ్మెల్సీ కోడ్‌ ముగియక ముందే ఎంపీ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్తు, పంచాయతీల ఎన్నికల కోడ్‌లు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తి కావాలంటే మరో ఆరు నెలల సమయం పట్టొచ్చు.అంతలోగా చెక్కుల కాలం తీరిపోతే కథ మామూలే.

కోడ్‌ వచ్చింది... సహకరించండి: కలెక్టరు

నారాయణపేట, న్యూస్‌టుడే : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని, అన్నీ రాజకీయ పార్టీలు అమలుకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఆర్వోగా వ్యవహరిస్తారని, నామినేషన్‌ దాఖలు కూడా మహబూబ్‌నగర్‌లోనే ఉంటుందన్నారు.పేట జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మూడు మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు , ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటు వేయవచ్చన్నారు. పాత ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 209 మంది ఓటర్లు ఉన్నారని, కొత్త జాబితా వచ్చాక తెలియజేస్తామన్నారు.

ఎమ్మెల్యే అనుమతితో అందజేస్తాం

కోడ్‌ అమలులోకి వచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేశాం. జాప్యం జరిగితే జరిగే నష్టం విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. లబ్దిదారులకు ఇబ్బందులు కలుగవద్దన్న ఎమ్మెల్యే సూచన మేరకు త్వరలో అదికారుల చేతులమీదుగా చెక్కులను అందజేస్తాం.

సింధూజ తహసీల్దారు, ధన్వాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని