logo

మహిళలకు వడ్డీ రాయితీ అందేనా?

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందజేస్తున్నాయి. క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తున్న మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణం పేరుతో తిరిగి వడ్డీ డబ్బులు చెల్లిస్తుంది.

Updated : 29 Feb 2024 04:28 IST

జిల్లాలో రూ. 62.85 కోట్ల మేర బకాయిలు

నాగర్‌కర్నూల్‌ : పెద్దకొత్తపల్లి ఐకేపీ కార్యాలయంలో మహిళలకు రుణాలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

కందనూలు, న్యూస్‌టుడే : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందజేస్తున్నాయి. క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తున్న మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణం పేరుతో తిరిగి వడ్డీ డబ్బులు చెల్లిస్తుంది. నాలుగేళ్లుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో మహిళలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళ సంఘాలకు వడ్డీ బకాయిల చెక్కులను అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలకు రూ.1,200 కోట్లు మంజూరు చేయాలని ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని మహిళ సంఘాల సభ్యులు వడ్డీ రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు. వడ్డీ త్వరగా మంజూరైతే ఆర్థిక ఊరట లభించనుందని పేర్కొంటున్నారు.

చివరగా 2019లో :  జిల్లాలో మొత్తం 12,043 మహిళ సంఘాలున్నాయి. వీటి పరిధిలో 1,20,430 మంది సభ్యులున్నారు. సంఘాలకు చివరగా 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వం 2019లో చెల్లించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వడ్డీకి అర్హత పొందిన సంఘాల వివరాలను జిల్లా డీఆర్‌డీవోశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నా.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన సంఘాల సభ్యులు మాత్రం ప్రతి నెల సక్రమంగా రుణాలు చెల్లిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 వరకు సంబంధించి జిల్లాకు రూ.62.85 కోట్ల మేరకు నిధులు విడుదల చేయాల్సి ఉందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. సంఘాలకు సక్రమంగా వడ్డీ బకాయిలు విడుదల కాకపోవడం వలన కొందరు మహిళలు రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

మంజూరైన వెంటనే జమ చేస్తాం..

జిల్లాలో వడ్డీ పొందడానికి అర్హత సాధించిన సంఘాల వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే ఆయా సంఘాల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన సభ్యులు ప్రతి నెల సకాలంలో డబ్బులు చెల్లించాలి. రుణాలు సద్వినియోగం చేసుకునేలా సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం.

చిన్నఓబులేశ్‌, డీఆర్‌డీఏ పర్యవేక్షణాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని