logo

ఆదాయం ఘనం.. సౌకర్యాలు కనం

దేవాలయాలకు రూ.కోట్లల్లో ఆదాయం వస్తున్నా భక్తులకు కల్పించాల్సిన వసతులపై దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలు చాలా ఉన్నాయి.

Published : 29 Feb 2024 04:43 IST

దేవాలయాల వద్ద భక్తుల బసకు గదుల కొరత

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ సాంస్కృతికం: దేవాలయాలకు రూ.కోట్లల్లో ఆదాయం వస్తున్నా భక్తులకు కల్పించాల్సిన వసతులపై దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలు చాలా ఉన్నాయి. ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఆనవాయితీ ప్రకారం కుటుంబ సమేతంగా దేవాలయం వద్ద నిద్ర చేసేందుకు గదులు లేకపోవటం సమస్యగా మారింది. కొన్ని ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో గదులు ఉన్నా సరైన నీటి వసతి, స్నానాల గదులు, మురుగుదొడ్లు, ఫ్యాన్లు లేకపోవటం, అపరిశుభ్రత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు మండుతున్నాయి. ఆలయ ప్రాంగణాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి. ఇప్పటికీ చాలా దేవాలయాల్లో ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

క్షేత్రస్థాయి  పరిస్థితిదీ..

  • జాతర సమయమే కాకుండా శ్రావణమాసం, మాఘమాసం, కార్తికమాసం, అమావాస్య, పౌర్ణమి లాంటి ప్రత్యేక రోజుల్లో దేవాలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఇవే కాకుండా వేసవి సెలవుల్లో దేవుడి సన్నిధిలో గడపాలని తమ పిల్లలతో కలిసి కుటుంబాలు దైవదర్శనాలకు వెళ్తుంటాయి. కొత్తగా వివాహమైన జంటలు దేవాలయాల వద్ద నిద్ర చేసి మొక్కులు తీర్చుకుంటారు. దేవాదాయ శాఖ పరంగా సౌకర్యాలు లేకపోవటంతో ప్రైవేటు అద్దెగదులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా వారు భారీగా అద్దె వసూలు చేస్తున్నారు.
  • తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధమైన మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో నిత్యం భక్తుల కోలాహలం ఉంటుంది. అక్కడ 30 వరకు గదులు ఉన్నా సరిపోవటం లేదు. జాతర వేళలో విధులు నిర్వహించే పోలీసులు, వైద్యారోగ్యం, ఇతర శాఖల సిబ్బందే ఉంటున్నారు. భక్తులు దేవాలయం బయట కోనేరు, తేరు మైదాన ప్రాంతాల్లో నిద్రిస్తున్నారు.
  • ఊర్కొండపేట శ్రీఆంజనేయస్వామి ఆలయం వద్ద గదులు లేవు. జాతర సమయంతో పాటు భక్తులు ఇక్కడ నిత్యం వ్రతాలు నిర్వహించి నిద్ర చేస్తారు. బీచుపల్లి శ్రీఆంజనేయస్వామి ఆలయ సన్నిధిలో గదుల కొరత వేధిస్తోంది. చాలా మంది సత్రంలో నిద్ర చేస్తున్నారు. దేవాలయానికి దగ్గర్లోని ప్రైవేటు లాడ్జిలు, అద్దె గదులను ఆశ్రయించాల్సి వస్తోంది.
  • శ్రీకురుమూర్తిస్వామి ఆలయం వద్ద 22 అద్దె గదులు ఉండగా ఐదింటిని ఆలయ అవసరాలకే వాడుతున్నారు. మిగతా 17 గదులను భక్తులకు ఇస్తారు. జాతర వేళ సరిపోవటం లేదు. ఈ దశలో కిందిస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అమావాస్య రోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి కురుమూర్తిస్వామిని దర్శించుకుంటారు.
  • ఫతేపూర్‌ మైసమ్మ దేవాలయంలో ప్రతి ఆది, మంగళవారాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. అక్కడ 10 వరకు భక్తుల గదులు ఉన్నా అపరిశుభ్రంగా మారాయి. ఆలయ పరిసరాలు అటవీ శాఖ పరిధిలో ఉండటంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామని ఈవో పేర్కొన్నారు.

ః అలంపూర్‌ జోగులాంబ, శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం వద్ద 10 వరకు గదులు ఉన్నాయి. అవి కూడా ఆలయానికి అర కి.మీ. దూరంలో ఉన్నాయి. ఎక్కువ శాతం భక్తులు దేవాలయం దగ్గర్లోని ప్రైవేటు గదులను ఆశ్రయిస్తున్నారు. సింగోటంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో 15 గదులు ఉన్నాయి. గంగాపూర్‌లో ఆలయంలో గదులు లేవు.
నిర్వహణపై నిరక్ష్యం : భక్తుల గదుల నిర్వహణను అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏటా కురుమూర్తిస్వామి, గంగాపూర్‌, మన్యంకొండ జాతరలకు కుటుంబ సమేతంగా వెళ్తాం. కురుమూర్తి ఆలయం వద్ద వసతి గదుల్లో స్నానాల గదులు, మరుగుదొడ్లు సరిగ్గా ఉండవు. పర్యవేక్షణ కొరవడి అపరిశుభ్రత నెలకొంది. అధికారులు స్పందించాలి.

రాఘవాచారి, మహబూబ్‌నగర్‌

చలువ పందిళ్లు వేయాలి.. : ఏటా కురుమూర్తిస్వామి, అలంపూర్‌, గంగాపూర్‌, ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయాలను కుటుంబ సమేతంగా దర్శించుకుంటాం. దైవ దర్శనం తర్వాత ఆలయ పరిసరాల్లో కాస్త సేదతీరే పరిస్థితి ఉండటం లేదు. వేసవిలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి. గంగాపూర్‌ ఆలయం వద్ద భక్తుల బసకు గదులే లేవు.

శాంతారెడ్డి, మహబూబ్‌నగర్‌

కురుమూర్తిస్వామి దేవాలయం వద్ద అపరిశుభ్రంగా విశ్రాంతి భవనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని