logo

అక్రమాలు కప్పిపుచ్చే ఎత్తుగడ

వరి ధాన్యం నిల్వ చేసిన గోదాం సామర్థ్యం తక్కువగా ఉన్నా.. మిల్లు యజమాని మాత్రం ఎక్కువగా చేశానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ వద్ద ఉండే ప్రభుత్వ వ్యవసాయం గోదాంలో ఇటీవల సీఎంఆర్‌ ధాన్యం చోరీ జరిగిన విషయం తెలిసిందే.

Published : 29 Feb 2024 04:45 IST

చిన్నంబావి మండలం పెద్దదగడలోని గోదాం

పెబ్బేరు, న్యూస్‌టుడే: వరి ధాన్యం నిల్వ చేసిన గోదాం సామర్థ్యం తక్కువగా ఉన్నా.. మిల్లు యజమాని మాత్రం ఎక్కువగా చేశానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ వద్ద ఉండే ప్రభుత్వ వ్యవసాయం గోదాంలో ఇటీవల సీఎంఆర్‌ ధాన్యం చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ గోదాంలో 2,500 మెట్రిక్‌ టన్నులు (62,500 బస్తాలు) నిల్వ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఈ గోదాంలో ధాన్యం నిల్వ చేసిన మిల్లు యజమాని మాత్రం 1.15 లక్షల బస్తాలను నిల్వ చేశానని.. వీటిలో వేల బస్తాలు చోరీ అయ్యాయని పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశారు. గోదాం సామర్థ్యం కంటే ఎక్కువ మొత్తంలో ధాన్యం ఎలా నిల్వ చేస్తారనేది అసలు ప్రశ్న. ఈ కోణంలో అధికారులు ఆలోచన చేయకపోవడంపై అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది.

పక్కదారి పట్టించిన సీఎంఆర్‌ ధాన్యం కోసమేనా?: వనపర్తి జిల్లాలో ముఖ్య అధికారిగా పని చేసిన ఓ అధికారి కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న బియ్యం మిల్లుకు ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్‌ వరిధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించారు. తన చేతులపని కావడంతో ఆ అధికారి ఇతర మిల్లులకు తక్కువ ధాన్యం కేటాయించి తమ మిల్లు నిర్మాణంలో ఉన్నా అప్పట్లో లక్షల బస్తాలను కేటాయించినట్లు ఇతర మిల్లర్లు ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా గత నెలరోజుల్లో హైదరాబాద్‌కు చెందిన విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేసి తనిఖీలు నిర్వహించగా.. ఈ మిల్లుకు కేటాయించిన ధాన్యంలో 2.25 లక్షల బస్తాలు మాయమైనట్లు వెల్లడించారు. ఈ ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాయమైన ధాన్యం బస్తాల లెక్క చూయించేందుకు పెద్దదగడలోని గోదాంను అద్దెకు తీసుకుని అందులో తక్కువ మొత్తంలో నిల్వ చేసి, ఎక్కువగా నిల్వ చేశామని ఫిర్యాదులో పేర్కొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వానికి ఇవ్వని బియ్యం: అధికారి కుటుంబ సభ్యుల మిల్లుకు 2022- 23లో వానాకాలం, యాసంగిలో ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్‌ వరి ధాన్యంలో నేటికీ సుమారు 14 వందల మెట్రిక్‌ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి ఉన్నా పౌరసరఫరాల శాఖ అధికారులు సదరు మిల్లు యజమానులపై ఒత్తిడి చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. పెద్దదగడ గోదాంలో సీఎంఆర్‌ ధాన్యం చోరీ అయిన విషయంలో హమాలీలు, కూలికోసం వచ్చిన వాళ్లపై కేసులు నమోదు చేశారని.. అసలైన నిందితులను గుర్తించడం లేదని ఆరోపణలున్నాయి.

మూడు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం

పెద్దదగడ గోదాం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సైతం గోదాంను తనిఖీలు చేస్తున్నారు. ఈ గోదాం సామర్థ్యం ఎంత.. అందులో ఎంత సీఎంఆర్‌ ధాన్యం నిల్వ చేశారనే అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల విచారణ అనంతరం నివేదిక అందించిన వెంటనే పూర్తిగా తెలుసుకుని వివరాలను వెల్లడిస్తాం.

శ్రీనాథ్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి, వనపర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని