logo

అంతర్జాలం.. అందని ద్రాక్ష!

పల్లెల్లోనూ డిజిటల్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం టి-ఫైబర్‌ ప్రవేశపెట్టింది. పనులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తికాలేదు. పంచాయతీల్లో బిగించిన టి-ఫైబర్‌ పరికరాలకు కనెక్షన్లు ఇవ్వకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి.

Published : 29 Feb 2024 04:47 IST

ఏళ్లుగా సాగుతున్న టి-ఫైబర్‌ పనులు

అంతర్జాల సౌకర్యం కల్పించని రాజాపూర్‌ గ్రామ పంచాయతీ భవనం

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం: పల్లెల్లోనూ డిజిటల్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం టి-ఫైబర్‌ ప్రవేశపెట్టింది. పనులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తికాలేదు. పంచాయతీల్లో బిగించిన టి-ఫైబర్‌ పరికరాలకు కనెక్షన్లు ఇవ్వకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. గ్రామీణులకు అంతర్జాల సేవలు అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టగా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని నెలల క్రితం టి-ఫైబర్‌ సేవల సన్నాహక పరీక్ష నిర్వహించి కొన్ని రోజుల పాటు వేగం పరిశీలించారు. సేవలు కొనసాగుతాయనుకున్నప్పటికీ వాటిని మధ్యలోనే ఆపేశారు.

  • జిల్లాలో 441 గ్రామ పంచాయతీలు ఉండగా అన్నింటికి ఇప్పటికే కంప్యూటర్లు కేటాయించారు. పంచాయతీలకు చాలా వరకు ప్రైవేటుగా అంతర్జాల (ఇంటర్నెట్‌) కనెక్షన్‌ ఇచ్చారు. చాలా గ్రామాల్లో సరిగ్గా అంతర్జాలం రాకపోవడంతో అవి మూలకు చేరాయి. కొన్ని పంచాయతీల కంప్యూటర్లను ఎంపీడీవో కార్యాలయాలకు తరలించగా ఆపరేటర్లు అక్కడే పనిచేస్తున్నారు. పల్లెల్లో ప్రజలు ధ్రువపత్రాలు అవసరమైతే ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. టి-ఫైబర్‌ సేవలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చినా చాలా పంచాయతీలకు సొంత భవనాలు లేవు. ఆవాస గ్రామాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇతర భవనాల్లో నిర్వహిస్తున్నారు. అంతర్జాల సేవల కోసం గ్రామాలకు లైన్లు వేయటం కష్టమవుతోంది. ఇటీవల గ్రామాల్లో సీసీదారులు నిర్మించినా టి-ఫైబర్‌ కేబుల్‌ కోసం ధ్వంసం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
  •  ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాల మంజూరు, పన్నుల వసూలు, వ్యయాలు, కార్మికుల జీతభత్యాలు తదితర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. టి-ఫైబర్‌ ఏర్పాటు కాకపోవడంతో పల్లె ప్రజలకు డిజిటల్‌ సేవలు అందడం లేదు. జిల్లాల వారీగా అన్ని పంచాయతీలకు టీ-ఫైబర్‌తో అనుసంధానించాల్సి ఉంది. కొన్ని నెలలుగా క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన పరికరాలు బిగించారు. విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ భవనాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. సన్నాహక పరీక్ష చేసి వదిలేశారు.
  • ఒకేసారి ప్రారంభించేలా చర్యలు : జిల్లాలోని అన్ని పంచాయతీల్లో టి-ఫైబర్‌ పనులు కొనసాగుతున్నాయి. చాలాచోట్ల పూర్తి చేసినట్లు సంబంధిత సంస్థ ప్రతినిధులు చెప్పారు. అంతర్జాలం కనెక్షన్‌ ఇస్తే ఆపరేటర్లకు సౌకర్యంగా ఉంటుంది. ఎప్పుడు అడిగినా కాస్త సమయం అంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒకేసారి సేవలు ప్రారంభించేలా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి

ఆర్డీవోగా నవీన్‌ నియామకం

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాకు నలుగురు ఆర్డీవోలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికల బదిలీల్లో భాగంగా ఈసారి ఆర్డీవోలకు స్థాన చలనం కల్పించి కొత్తవారిని కేటాయించారు. కామారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమాధికారిగా పనిచేసిన ఇ.నవీన్‌ను మహబూబ్‌నగర్‌ ఆర్డీవోగా నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని