logo

ఎల్‌ఆర్‌ఎస్‌పై.. స్థిరాస్తి వ్యాపారుల కన్ను

స్థిరాస్తి వ్యాపారులు, రాజకీయ నేతల కన్ను లేఅవుట్‌ క్రమబద్దీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌)పై పడింది. ఉమ్మడి జిల్లాలో 2020లో ఈ పథకం కింద పెద్ద ఎత్తున దరఖాస్తులొచ్చాయి. పురపాలికల్లో 1.95 లక్షలు, గ్రామపంచాయతీల్లో 64వేల మంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Updated : 29 Feb 2024 06:10 IST

మహబూబ్‌నగర్‌ శివారులోని పాలకొండ పెద్ద చెరువు శిఖంలో వేసిన కడీలు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: స్థిరాస్తి వ్యాపారులు, రాజకీయ నేతల కన్ను లేఅవుట్‌ క్రమబద్దీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌)పై పడింది. ఉమ్మడి జిల్లాలో 2020లో ఈ పథకం కింద పెద్ద ఎత్తున దరఖాస్తులొచ్చాయి. పురపాలికల్లో 1.95 లక్షలు, గ్రామపంచాయతీల్లో 64వేల మంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రూ.10 వేలు, ప్లాట్‌ క్రమబద్ధీకరణకు రూ.వెయ్యి చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో 70 శాతం దరఖాస్తులు కేవలం పురపాలికల్లోనే వచ్చాయి. జిల్లా కేంద్రాల పురపాలికలు, జాతీయ రహదారిపై ఉన్న మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల నుంచి దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. వీటిలో 40 శాతం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అధికారుల దృష్టికి రావడంతో స్థిరాస్తి వ్యాపారులు, రాజకీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వీరే వెంచర్లు వేసి విక్రయించారు.  అక్రమ వెంచర్లపై పలు సందర్భాల్లో పాలమూరులో ఫిర్యాదులొచ్చాయి. ప్లాట్లు కొనుగోలు చేసుకున్నవారు ఆందోళన చేసిన సందర్భాలున్నాయి. వీరిందరికీ ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా న్యాయం జరుగుతుందని బుజ్జగిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు మోక్షం కల్పించనుండటంతో పైరవీలకు సిద్ధమవుతున్నారు.

పురాల్లో అత్యధికం : మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, భూత్పూరు, మక్తల్‌, కొత్తకోట మున్సిపాలిటీల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి వెంచర్లు వేసినట్లు ఆరోపణలొచ్చాయి. చెరువు శిఖం భూములు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో పెద్ద ఎత్తున లేఅవుట్లు వెలిశాయి. దేవాదాయ, భూదాన్‌, అసైన్డు భూముల్లోనూ వెంచర్లు వేశారు. ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో స్థిరాస్తి వ్యాపారులు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద దరఖాస్తు చేయించారు. మహబూబ్‌నగర్‌లో 31 వేలు, వనపర్తి-28 వేలు, జడ్చర్ల-17 వేలు, నాగర్‌కర్నూల్‌-16వేలు, గద్వాల-14 వేలు, మక్తల్‌-10 వేలు దరఖాస్తులొచ్చాయి. వీటిలో ఎక్కువగా చెరువులను ఆక్రమించి లేఅవుట్లు చేసినవే ఉన్నాయి. ప్రభుత్వానికి చెందిన కుంటల్లో ప్లాట్లు చేయడానికి వీలు లేదు. స్థిరాస్తి వ్యాపారులు కుంటలను కొనుగోలు చేసి వెంచర్లు వేశారు. మిగతా పురాల్లో చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. భూత్పూరులో 6 వేల దరఖాస్తులు రాగా భూదాన్‌ భూములే అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన భూముల్లోనూ వెంచర్లు వేశారు. ఈ వెంచర్లలో తెర వెనుక రాజకీయ నేతలే ఉండటంతో అప్పట్లో వీటిపై చర్యలు తీసుకోలేదు. ఇప్పుడూ ఈ లేఅవుట్లను క్రమబద్ధీకరణతో సక్రమంగా చేసుకోవాలని చూస్తున్నారు.

గ్రామపంచాయతీల్లోనూ..: హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పలు గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లు వెలిశాయి. ఈ ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. పాటు కాలువలను పూడ్చేశారు. అసైన్డు భూములకు నిబంధనలకు విరుద్ధంగా ఓఆర్‌సీలు తెచ్చుకుని వెంచర్లు వేసి తక్కువ ధరకు విక్రయించారు. ఈ గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులొచ్చాయి. ఉమ్మడి జిల్లాలో గ్రామపంచాయతీల్లో వచ్చిన మొత్తం 64 వేల దరఖాస్తుల్లో 20 వేల వరకు చెరువుల కింద వేసిన వెంచరు ప్లాట్లు ఉన్నట్లు గతంలోనే అధికారులు దృష్టికి వచ్చింది.

అక్రమాల వల్లే..: ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జీవో నంబరు 58, 59లో భాగంగా జరిగిన క్రమబద్ధీకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. నిబంధనలు పక్కన పెట్టి పలు ఇళ్లను క్రమబద్ధీకరించగా రాజకీయ నేతలే కీలక పాత్ర పోషించారు. ఎల్‌ఆర్‌ఎస్‌లో మాత్రం స్థిరాస్తి వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. పురపాలికల్లో కమిషనర్లు, గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన జరగనుంది. మొదటి దశలో దరఖాస్తుల పరిశీలన, రెండో దశలో క్రమబద్ధీకరణకు అర్హమైనవా? లేదా? మూడో దశలో ఫీజు చెల్లింపులుంటాయి. నెల రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండటంతో ఏ మేరకు అనర్హమైన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని