logo

వాడీవేడి చర్చ.. జడ్పీ సమావేశం తీరు

సమస్యలపై వాడివేడీ చర్చ.. పరిష్కారంలో జాప్యంపై అధికారుల నిలదీత.. అభివృద్ధి పనులు, ప్రగతిపై ప్రశ్నల పరంపర.. ఇత్యాది అంశాల సమాహారంగా సిద్దిపేటలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది.

Published : 21 Mar 2023 02:42 IST

మాట్లాడుతున్న రోజాశర్మ, చిత్రంలో ఫారూఖ్‌హుస్సేన్‌, ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

న్యూస్‌టుడే, సిద్దిపేట: సమస్యలపై వాడివేడీ చర్చ.. పరిష్కారంలో జాప్యంపై అధికారుల నిలదీత.. అభివృద్ధి పనులు, ప్రగతిపై ప్రశ్నల పరంపర.. ఇత్యాది అంశాల సమాహారంగా సిద్దిపేటలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సోమవారం జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సభ్యులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో జడ్పీ అధ్యక్షురాలు.. ఎప్పటికప్పుడు సభ్యులను సమన్వయంతో శాంతపర్చుతూ సభను ముందుకు నడిపించారు. ఒకానొక దశలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రస్తావన రాకతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. సెర్ప్‌ ఉద్యోగులకు పే స్కేల్‌ అమలు, ఆరోగ్య మహిళా క్లినిక్‌ల ఏర్పాటుపై మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలలోపు పూర్తయింది. జడ్పీ అధ్యక్షురాలు సహా ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, జడ్పీ సీఈవో రమేశ్‌ పాల్గొన్నారు. సభ్యులు పూర్తిస్థాయిలో హాజరు కాలేదు. 11 శాఖలతో ప్రగతి నివేదిక సమర్పణ, చర్చలతో సమావేశాన్ని ముగించారు. పంచాయతీరాజ్‌ పరిధిలో ధర్మారం-లక్కపల్లి రహదారి నిర్మాణం ఏళ్లుగా పూర్తి కావడం లేదంటూ మద్దూరు జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో జిల్లా ముందుందని, అసలు పరిష్కారమవటం లేదంటూ వ్యాఖ్యానించడం తగదని అధ్యక్షురాలు అన్నారు. చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం మృతిపై సంతాపం ప్రకటిస్తూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

పూర్తి స్థాయిలో సభ్యులు హాజరు కాకపోవడంతో ఖాళీగా కుర్చీలు

ప్రధాన సమస్యలు

* జగదేవపూర్‌, కోహెడ మండలాల్లో వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. మద్దూరు మండలంలో వరికి మొగి పురుగు సోకి నష్టపోయే పరిస్థితి నెలకొంది.

* బెజ్జంకి, చేర్యాల మండలాల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. వర్గల్‌లో రూ.కోట్లు వెచ్చించి బస్టాండ్‌ నిర్మించినా బస్సులు రావడం లేదు.

* వర్గల్‌, చేర్యాల మండలాల్లో పింఛను మంజూరు అయినా ఖాతాల్లో సొమ్ము పడటం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు