logo

దిశానిర్దేశం.. శ్రేణుల సన్నద్ధం

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో అధికార కాంగ్రెస్‌ ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది.

Updated : 13 Apr 2024 05:58 IST

ప్రణాళికతో ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

మరికొద్దిరోజుల్లో నామినేషన్ల ఘట్టానికి తెరలేవనుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాయి. సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేస్తూ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నాయి. నామినేషన్‌ దాఖలు సమయం, ముగియగానే పార్టీ అగ్రనేతల సభల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే యోచనలో భారాస, మాజీ ప్రధాని ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడం, అధికారంలో ఉండడంతో విజయం సాధిస్తామని కాంగ్రెస్‌, ప్రధాని మోదీ చరిష్మా గెలుపునకు దోహదపడుతుందని ధీమాతో భాజపా ఉంది. షెడ్యూల్‌ వెలువడిన అనంతరం నెమ్మదిగా ప్రచారాన్ని ప్రారంభించిన ఆయాపార్టీలు, ఇటీవల మరింత ఉద్ధృతం చేశాయి. ఈ నెల 18న నామినేషన్‌ దాఖలు షురూ కాగానే ప్రచారంలో మరింత వేగం పెంచనున్నాయి.  


 సంక్షేమ పథకాలే అస్త్రంగా...

 

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో అధికార కాంగ్రెస్‌ ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆ పార్టీకి అస్త్రాలు కానున్నాయి. అయిదేళ్ల పాటు అధికారంలో ఉండనుండడంతో చేపట్టే అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు రాబట్టుకోవాలని యోచనలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తూ, శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశం జరుగగా, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలను నిర్వహించారు. మంత్రి కొండా సురేఖకు పార్లమెంట్‌ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించగా, ఆమె ఆయా సమావేశాల్లో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సమావేశాలు పూర్తయ్యాక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అభ్యర్థి ప్రచార రథాలను సిద్ధం చేశారు.


మాజీ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి...

సిట్టింగ్‌ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భారాస పట్టుదలతో ఉంది. పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ఆరింటిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ]్యం వహిస్తుండడం కలిసొస్తుందని భావిస్తున్నారు. మాజీ సీఎం, గులాబీ అధినేత కేసీఆర్‌ సొంత జిల్లా కావడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారించి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అభ్యర్థి గెలుపు బాధ్యతను మాజీ మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. ఈ మేరకు మండలాలు, పట్టణాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎంపీగా గెలిపిస్తే రూ.100 కోట్లతో ట్రస్ట్‌ ఏర్పాటు చేయిస్తామని అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పదేపదే ప్రస్తావిస్తున్నారు. కళాకారుల ఆటపాటలతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 16న సంగారెడ్డి జిల్లాలో సభ నిర్వహించి మాజీ సీఎం కేసీఆర్‌  ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.


నిరంతరం కలిసేలా..

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలను వివరిస్తూ భాజపా ఓట్లను అడుగుతోంది. వాటి ద్వారా లబ్ధిపొందిన వారి ఇళ్లకు ప్రదాని మోదీ స్టిక్కర్‌ అతికిస్తున్నారు. అంతేకాకుండా లబ్ధిదారు చరవాణి నుంచి ఓ నంబర్‌కు మిస్డ్‌కాల్‌ చేయిస్తున్నారు. ప్రతి ఇంటికి అభ్యర్థి, ప్రధాని చిత్రాలతో కూడిన క్యాలెండర్‌ను పంపిణీ చేశారు. గ్రామం, పట్టణాల్లో ఉన్న వార్డుల ప్రకారం ఓటరు జాబితా సేకరించి, అందులో ఒక పేజీకి ఒక నాయకుడిని లేదా కార్యకర్తను నియమించారు. వీరిని ‘పన్నా ప్రముఖ్‌’గా పిలుస్తున్నారు. వీరు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఓటర్లను నిరంతరం కలుస్తుండాలి. మెదక్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గ బూత్‌ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు నేరుగా ఓటర్ల వద్దకు వెళుతున్నారు. ఉదయం ఆయా పట్టణాల్లో వాకర్స్‌ను కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు. 1999లో ఈ స్థానం నుంచి భాజపా గెలుపొందగా, ప్రస్తుతం వాతావరణం అనువుగా ఉండడంతో ఈ సారి విజయం సాధించాలనే పట్టుదలతో కమలం పార్టీ శ్రేణులు ఉన్నారు. మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలు కలిసిచ్చేలా... అగ్రనేతల సభ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.


స్థానం: మెదక్‌ లోక్‌సభ,  అభ్యర్థులు: రఘునందన్‌రావు (భాజపా)
నీలం మధు (కాంగ్రెస్‌)
వెంకట్రామిరెడ్డి (భారాస)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని