logo

ఇళ్లు కేటాయించాలని లబ్ధిదారుల నిరసన

అర్హులుగా ఎంపిక చేసి ఏళ్లు గడుస్తున్నా ఎందుకు కేటాయించడం లేదంటూ గజ్వేల్‌ పట్టణానికి చెందిన రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులు శుక్రవారం మాజీ సీఎం, ఎమ్మెల్యే కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం వద్ద నిరసనకు దిగారు

Updated : 13 Apr 2024 05:57 IST

ములుగు, న్యూస్‌టుడే: అర్హులుగా ఎంపిక చేసి ఏళ్లు గడుస్తున్నా ఎందుకు కేటాయించడం లేదంటూ గజ్వేల్‌ పట్టణానికి చెందిన రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులు శుక్రవారం మాజీ సీఎం, ఎమ్మెల్యే కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం వద్ద నిరసనకు దిగారు. గజ్వేల్‌ పట్టణానికి సమీపంలో 1,100 రెండు పడక గదుల ఇళ్లను 8 ఏళ్ల క్రితం నిర్మించారు. ఇటీవల శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందు దరఖాస్తులు స్వీకరించి లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించారు. మల్లన్న సాగర్‌ ముంపు గ్రామాల నిర్వాసితులు తాత్కాలికంగా ఆ ఇళ్లల్లో ఉంటున్నారు. వారికి పూర్తిస్థాయి ప్యాకేజీలు రాకపోవడంతో ఖాళీ చేయడం లేదు. లాటరీ పద్ధతిలో ఇల్లును సొంతం చేసుకున్న సంబంధిత లబ్ధిదారులు గృహప్రవేశానికి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మారినా తమ ఇళ్ల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈమేరకు శుక్రవారం ఆందోళనకు దిగారు. వాహనాల్లో మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. బయటకు కేసీఆర్‌ వచ్చి మాట్లాడాలని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న మర్కూక్‌ ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తన సిబ్బందితో వచ్చి లబ్ధిదారులకు నచ్చచెప్పారు. సమస్యలను లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతామని హామీ ఇవ్వడంతో మూడు గంటల తర్వాత తిరిగి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని