logo

స్వార్థంతో కాంగ్రెస్‌ను వీడిన సునీతారెడ్డి

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు పదిహేనేళ్లపాటు అధికారం అనుభవించిన నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు స్వార్థంతో పార్టీని వీడి భారాసలో చేరారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు.

Updated : 13 Apr 2024 05:56 IST

మంత్రి కొండా సురేఖ

సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి కొండాసురేఖ, వేదికపై నీలం మధు, రాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్‌

 నర్సాపూర్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు పదిహేనేళ్లపాటు అధికారం అనుభవించిన నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు స్వార్థంతో పార్టీని వీడి భారాసలో చేరారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. స్థానిక సాయికృష్ణ గార్డెన్‌లో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్‌ పార్టీ సన్నాహక సమావేశం శుక్రవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ను వదిలిపెట్టి తల్లిలాంటి పార్టీని మోసం చేసిందన్నారు. తానూ కాంగ్రెస్‌ను వీడినా, ఒక జెండా మీద గెలుపొంది, మరోపార్టీ జెండా పట్టుకోలేదని గుర్తుచేశారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన నీలం మధుకు మెదక్‌ ఎంపీగా పోటీచేసే అవకాశం వచ్చినందున, బీసీలంతా ఆయన గెలుపు కోసం పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌ కాళ్లుమొక్కి ఎంపీ టికెట్‌ తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన నీలం మధును మెదక్‌ ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు. అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ.. ఇందిరాగాంధీÅ ప్రాతినిధ్యం వహించిన మెదక్‌ నుంచి తనకు పోటీచేసే అవకాశం రావడం అదృష్టమని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై గళం వినిపిస్తానని అన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆవులరాజిరెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల అధ్యక్షులు నిర్మలారెడ్డి, ఆంజనేయులుగౌడ్‌ మాట్లాడారు. ఎంపీపీ జ్యోతి, నాయకులు రవీందర్‌రెడ్డి, సుహాసినిరెడ్డి, సుజాత, జయశ్రీ, కమల, హంసీభాయి, శ్రీనివాస్‌గౌడ్‌, నరేందర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సుధీర్‌, అశోక్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని