logo

రూ.కోట్లు వెచ్చించి.. మధ్యలో ఆపేసి..

అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేస్తున్నప్పటికీ అవి పూర్తి కావడం లేదు. నర్సాపూర్‌లో ఇదే పరిస్థితి నెలకొంది.

Updated : 13 Apr 2024 05:56 IST

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేస్తున్నప్పటికీ అవి పూర్తి కావడం లేదు. నర్సాపూర్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన సామాజిక భవనాల నిర్మాణాలు పూర్తికాలేదు. ఆయా వర్గాల వారికి భవనాలు మంజూరు చేసిన ప్రజాప్రతినిధులు ఆ తర్వాత వాటి పురోగతిని పట్టించుకోవడంలేదు. పట్టణంలోని సునీతాలక్ష్మారెడ్డి కాలనీలో రూ.10లక్షలతో మహిళా మండలి భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయించినా, పనులు పూర్తికాలేదు. తలుపులు, కిటికీలు ఏర్పాటుచేసి ఫ్లోరింగ్‌ చేస్తే భవనం అందుబాటులోకి వస్తుంది. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు మరిన్ని నిధుల కోరుతూ ప్రతిపాదనలు పంపారు. ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న సామాజిక భవనానిది ఇదే పరిస్థితి. రూ.10లక్షలు  కేటాయించగా రెండంతస్తులతో స్లాబు వేశారు. ఏడాదిగా పనులు అసంపూర్తిగా దర్శనం ఇస్తున్నాయి. గౌడ సామాజిక భవనానికి రూ.కోటికిపైగా ఖర్చు చేసి స్లాబు వేసి వదిలేశారు.

అసంపూర్తిగా దుకాణ సముదాయం: 13వ వార్డులో కబేళాను తొలగించి, ఆ ప్రాంతంలో భవన నిర్మాణానికి  రూ.50లక్షలు కేటాయించారు. నిధులున్నంతమేరకు పనులు చేపట్టి మధ్యలో వదిలేశారు. కొంతవరకు ఇటుక గోడలు ఏర్పాటు చేసి ప్లాస్టరింగ్‌ చేయలేదు. పూర్తి చేసేందుకు మరో రూ.కోటి కేటాయించినా, పనులు సాగడంలేదు. పట్టణంలోని శాఖా గ్రంథాలయాన్ని డిజిటల్‌ లైబ్రరీగా అభివృద్ధి పర్చడంలో భాగంగా రూ.50లక్షలు కేటాయించారు. వీటితో మూడంతస్తుల భవనం నిర్మించి స్లాబు వేశారు. మిగతా పనులు పూర్తిచేయలేదు.

 పదేళ్లుగా పర్యాటక హోటల్‌..: నర్సాపూర్‌ - హైదరాబాద్‌ మార్గంలో పర్యాటక హోటల్‌ నిర్మాణానికి రూ.70లక్షలు మంజూరు చేశారు. పనులు ప్రారంభించిన గుత్తేదారు పునాదులు తీసి పిల్లర్లతో వదిలేశారు. దాదాపు పదేళ్లు అవుతున్నా, ముందుకు సాగడంలేదు. ఇనుప చువ్వలు తుప్పుపట్టాయి. దివ్యాంగుల ప్రభుత్వ వసతి గృహానిది ఇదే పరిస్థితి.  ఈవిషయాన్ని ఏఈ స్వామిదాసు వద్ద ప్రస్తావించగా.. అసంపూర్తి పనులకు అదనంగా నిధుల కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. కొన్నింటికి నిధులు కేటాయిస్తుండగా, మరికొన్నింటికి మంజూరు కావడం లేదు. వచ్చిన వాటి పనులు పూర్తి చేయిస్తున్నామన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని