logo

నియమావళి ఉల్లంఘిస్తే ఎసరే !

పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలనూ షురూ చేశాయి.

Updated : 13 Apr 2024 05:55 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, మెదక్‌, సిద్దిపేట, వికారాబాద్‌ కలెక్టరేట్‌: పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలనూ షురూ చేశాయి. ఉమ్మడి మెదక్‌లో మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, చేవేళ్ల పరిధిలో వికారాబాద్‌ జిల్లా కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌ నియోజకవర్గం కరీంనగర్‌, చేర్యాల, మద్దూరు ధూల్మిట్ట, కొమురవెల్లి భువనగిరి, వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే ఓటర్లను కలుస్తున్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. నిరక్ష్యంగా వ్యవహరిస్తే కొలువుకే ఎసరు వస్తుందని గుర్తుంచుకోవాలి.

నిబంధనలు ఇవీ: ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీ ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొనకూడదు. తన కింది ఉద్యోగులను, ఇతరులను ఫలానా పార్టీకే ఓటేయాలని ఆదేశించకూడదు

  •  ఓటర్లు ప్రలోభాలకు గురయ్యేలా ప్రకటనలు ఇవ్వకూడదు
  •  రాజకీయ పార్టీల కండువాలు వేసుకుని ప్రచారం చేయొద్దు
  •  సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టవద్దు.

తప్పించుకోలేకుండా నిఘా..: ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన విషయం విదితమే. ఇందులో భాగంగా వీడియో సర్వేలెన్స్‌, స్టాటిస్టికల్‌ సర్వేలెన్స్‌ బృందాల నియామక ప్రక్రియ పూర్తవగా, సభ్యులు ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన సభలు, సమావేశాలను అధికారులు చిత్రీకరిస్తున్నారు. వీటిని వ్యూయింగ్‌ బృందం వీక్షిస్తోంది. ఉద్యోగులు పాల్గొన్నట్లు ఫిర్యాదు రాగానే సంజాయిషీ నోటీసు జారీచేస్తారు. ఉల్లంఘించినట్లు తేలితే సస్పెన్షన్‌ వేటు వేస్తారు.
విధులకు హాజరుకావాల్సిందే..: ఎన్నికల విధులకు నియామకమైన ఉద్యోగులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. శిక్షణ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాలి. ఇప్పటికే తొలి విడత శిక్షణ సైతం పూర్తయింది. సరైన కారణం లేకుండా గైర్హాజరైతే తాఖీదులు అందుకోవాల్సి ఉంటుంది. సంజాయిషీ సక్రమంగా లేకపోతే సస్పెండ్‌ వేటు సైతం వేస్తారు.

సామాజిక మాధ్యమాలపై..

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, మీడియాలో వచ్చే వార్తలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా మీడియా మానిటరింగ్‌ బృందాన్ని అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలో ఏర్పాటు చేశారు. ఉద్యోగులు వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా, ప్రతికూలంగా పోస్టులు పెడితే మార్గదర్శకాలకు అనుగుణంగా చరలు తీసుకుంటారు.  సామాజిక మాధ్యమ ఖాతాలపై ఈసీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే విధుల నుంచి తప్పించి విచారించడం ఖాయం.

పకడ్బందీగా నిర్వహణ: సి.నారాయణరెడ్డి, వికారాబాద్‌ కలెక్టర్‌

లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మొదటి విడత పీవోలు, ఏపీలకు ఎన్నికల విధుల అవగాహనపై శిక్షణ ఇచ్చాం. నిబంధనల ప్రకారం ఉద్యోగులు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. వారిపై నిరంతరం నిఘా ఉంటుంది. జాగ్రత్తగా మసలుకోవాలి. ఒకవేళ పాల్గొన్నట్లు తేలితే చర్యలు తప్పవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని