logo

ఓటరు చైతన్యానికి విస్తృత ప్రచారం

లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే షెడ్యూల్‌ వెలువడగా, త్వరలో నోటిఫికేషన్‌ రానుంది

Updated : 13 Apr 2024 05:55 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే షెడ్యూల్‌ వెలువడగా, త్వరలో నోటిఫికేషన్‌ రానుంది. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్‌ తదితర ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో ఓటరు కీలకం కావడంతో... వారి చైతన్యమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గోడపత్రికలు, కరపత్రాలు, పుస్తకాలతో విస్రృత ప్రచారానికి ఏర్పాట్లు చేసింది.

 మార్గనిర్దేశం: ఓటర్లు ఓటు వేయడం ద్వారానే ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతారు. ఎన్నికల ప్రకియకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ‘ఓటరు గైడ్‌’ అనే చిన్న పుస్తకాన్ని(బుక్‌లెట్‌) ముద్రించింది. ఇందులో ఓటరుగా రిజస్ట్రేషన్‌ ప్రక్రియ, పోలింగ్‌ ప్రక్రియ, ఓటు వేసే విధానం, ఎన్నికల సంఘం యాప్‌ సదుపాయాలు, ఓటర్ల ప్రతిజ్ఞ తదితర అంశాలను పొందుపర్చారు. వీటిని బూత్‌ స్థాయి అధికారులు(బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి అందజేయనున్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ ద్వారా ఓటరు నమోదు, ఏయే తేదీల్లో కొత్తగా ఓటరుగా నమోదయ్యే వివరాలు, పోలింగ్‌ ప్రక్రియ ఏవిధంగా ఉంటుందనే.. చిత్రాలతో కూడిన వివరాలు ఇందులో ఉన్నాయి. సీ-విజిల్‌, ఓటర్‌ హెల్ప్‌లైన్‌, సాక్ష, నో యువర్‌ క్యాండిడేట్‌ యాప్‌ల గురించి కూడా వివరించారు.

 అవగాహన పెంపొందించేలా..: ఓటు వేసే విధానం, పోలింగ్‌ కేంద్రంలో పాటించాల్సిన పద్ధతులు, తీసుకెళ్లాల్సిన గుర్తింపు పత్రాలు, పోలింగ్‌ సిబ్బంది చేయవలసినవి, చేయకూడని వాటి వివరాలతో గోడ పత్రికలు సిద్ధం చేశారు. వీటిని ప్రతి పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. ఓటు వేసేందుకు అవసరమయ్యే పత్రాల గురించి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య కూడళ్ల వద్ద ప్రదర్శిస్తున్నారు. తదితరాలను వివరిస్తారు. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సామగ్రిని మండలాలకు, అక్కడి నుంచి పోలింగ్‌ కేంద్రాలకు తరలించన్చున్నారు.


నియోజకవర్గం ఓటర్లు
నారాయణఖేడ్‌ 2,36,377
అందోలు   2,50,086
జహీరాబాద్‌   2,74,196
సంగారెడ్డి   2,48,026
పటాన్‌చెరు   4,10,003

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు