logo

జల వనరులపై పట్టింపేది?

చెరువుల్లో ఎంత నీరున్నా తూములు, కాల్వలు బాగుంటేనే ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. జిల్లాలో సాగునీటి వనరులు తక్కువున్న ప్రాంతం నారాయణఖేడ్‌ నియోజకవర్గం. ఇక్కడున్న పలు చెరువుల తూములు, వాటి షట్టర్లు శిథిలమయ్యాయి.

Updated : 13 Apr 2024 05:54 IST

శిథిలమైన  తూములు, కాల్వలు

 గట్‌లింగంపల్లి ప్రాజెక్టు కింద బీడుగా భూములు

 న్యూస్‌టుడే, నారాయణఖేడ్‌: చెరువుల్లో ఎంత నీరున్నా తూములు, కాల్వలు బాగుంటేనే ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. జిల్లాలో సాగునీటి వనరులు తక్కువున్న ప్రాంతం నారాయణఖేడ్‌ నియోజకవర్గం. ఇక్కడున్న పలు చెరువుల తూములు, వాటి షట్టర్లు శిథిలమయ్యాయి. కాల్వలు పూడుకుపోయాయి. రెండు ప్రాజెక్టులకు కాల్వలే లేవు. అధికారులు వర్షాకాలం ప్రారంభంలోగా పక్కాగా మరమ్మతులు చేస్తే సత్ఫలితాలు ఉంటాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.

 నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో..

 ఖేడ్‌ నియోజకవర్గంలో ఖేడ్‌, మనూరు, నాగల్‌గిద్ద, కంగ్టి, సిర్గాపూర్‌, కల్హేర్‌, నిజాంపేట, పెద్దశంకరంపేట మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవరం్గలో 100 ఎకరాలకు పైబడి ఆయకట్టున్న చెరువులు 39. వాటికింద 16,791 ఎకరాల నిర్దేశిత ఆయకట్టు ఉంది. ఆయా చెరువులు ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఏడేళ్ల కిందట మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువుల్లో పూడికతీతకు ప్రాధాన్యమిచ్చినా.. కాల్వలు, తూముల మరమ్మతులను విస్మరించారనే విమర్శలున్నాయి. అనేక చెరువుల తూములు దెబ్బతిని నీరంతా వృథా అవుతోంది. అలుగులు కూలాయి. కాల్వలు శిథిలమయ్యాయి. దీంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు.

కొన్నింటికి కాల్వలు లేవు

చెరువుల్లోని నీరు చివరి ఆయకట్టుకు పారాలంటే కాల్వలు బాగుండటం ముఖ్యం. అన్ని చెరువులకు కాల్వలు ఉంటాయి. కానీ ఖేడ్‌ నియోజకవర్గంలోని రెండు ప్రాజెక్టులకు కాల్వలు అసలే లేవు. దీంతో వర్షాకాలంలో ఆయా ప్రాజెక్టులు నిండుతున్నా వాటి కింద భూములు బీడుగా ఉంటున్నాయి. ఖేడ్‌ మండలంలోని ఉజలంపాడ్‌లో 17 ఏళ్ల కిందట రూ.1.20 కోట్లతో 580 ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టును నిర్మించారు. కాల్వలను విస్మరించారు. దీంతో ప్రాజెక్టు నిండినా సాగుకు నీరందించలేని పరిస్థితి నెలకొంది.
మనూరు మండలం గట్‌లింగంపల్లిలో 15 ఏళ్ల కిందట రూ.60 లక్షలు వెచ్చించి 205 ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో గతంలో ప్రాజెక్టును నిర్మించారు. దీనికీ కాల్వలు నిర్మించలేదు. కొందరు రైతులు కాల్వ   తవ్వుకొని 40 ఎకరాల వరకు సాగు చేసుకుంటున్నారు. కాల్వలు నిర్మించాలని రైతులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. మనూరు మండలంలో 100 ఎకరాలకు పైబడి ఆయకట్టున్న చెరువులు రెండే కాగా.. అందులో   ఒకటైన గట్‌లింగంపల్లి ప్రాజెక్టు పరిస్థితి అధ్వానంగా మారింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని