logo

జలశుద్ధి కేంద్రంతో మహర్దశ

జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు కుంటల్లో నీరు లేదు. వాటికి భిన్నంగా కుకునూరుపల్లి మండలం మంగోల్‌ గ్రామంలోని దుడ్డె చెరువు, నల్ల చెరువులు మాత్రం మత్తడి పారుతున్నాయి

Updated : 13 Apr 2024 05:54 IST

వ్యర్థ జలాలతో మంగోల్‌లో నిశ్చింతంగా పంటల సాగు

 మంగోల్‌లో దుడ్డె చెరువు

కొండపాక గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు కుంటల్లో నీరు లేదు. వాటికి భిన్నంగా కుకునూరుపల్లి మండలం మంగోల్‌ గ్రామంలోని దుడ్డె చెరువు, నల్ల చెరువులు మాత్రం మత్తడి పారుతున్నాయి. పంట పొలాలకు పూర్తిగా నీళ్లందిస్తున్నాయి. దీనికంతా మంగోల్‌లో ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ తాగునీటి జలశుద్ధి కేంద్రం కారణం. మల్లన్నసాగర్‌ జలాశయం ఆధారంగా మంగోల్‌ గ్రామంలో 540 ఎంఎల్‌డీల సామర్థ్యంతో జలశుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. దీని నుంచి సిద్దిపేట, జనగామ, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, మెదక్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌, జిల్లాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 16 పట్టణాలు, 1,922 ఆవాసాలకు తాగునీరు సరఫరా అవుతుంది. మంగోల్‌ కేంద్రంలో జలాల శుద్ధి ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది.

 కాలువల్లోకి మళ్లింపు..

భారీ మొత్తంలో వ్యర్థ జలాలు శుద్దికేంద్రం నుంచి బయటకు విడుదల అవుతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి పిల్ల కాలువలు నిర్మించుకొని గ్రావిటీ ద్వారా దుడ్డె, నల్ల చెరువులకు మళ్లించారు. రెండు చెరువుల్లోకి నీరు చేరడంతో నిండి మత్తడి పారుతున్నాయి. మత్తడి పారుతుండగా జలాలను పొలాల్లోకి వెళ్లకుండా గ్రామస్థులు మల్లన్నసాగర్‌ కాలువల్లోకి మళ్లించారు. ఈ ప్రాంతంలో నీటి కొరత లేకపోవడంతో రైతులు నిశ్చింతంగా పంటలు పండించుకుంటున్నారు. భవిష్యత్తులోనూ మంగోల్‌కు సాగునీటికి కష్టాలు ఉండవని గ్రామస్థులు చెబుతున్నారు. సంవత్సరానికి రెండు పంటలు పండించగలుగుతున్నామంటున్నారు. గ్రామంలో నివసిస్తున్న దాదాపు 100కు పైగా మత్స్యకారుల కుటుంబాలకు చెరువుల ద్వారా ఉపాధి లభిస్తోంది. వ్యర్థ జలాలను వృథా కాకుండా సద్వినియోగం చేసుకుంటున్నామని.. ఏడాదిన్నరగా రెండు చెరువులూ మత్తళ్లు దూకుతున్నాయని మాజీ సర్పంచి పుల్లోజు కిరణ్‌కుమార్‌ తెలిపారు.

ఏడెకరాల్లో వరి వేశా: బాపురెడ్డి, రైతు, మంగోల్‌

శుద్ధి కేంద్రం నుంచి వెలువడే వ్యర్థ జలాల ఆధారంగా నేను ఏడెకరాల భూమిలో వరి సాగు చేపట్టా. గతంలో కేవలం మూడెకరాల్లో వరి వేస్తుంటి. వేసవిలో నీరందక కొంత ఎండిపోయేది. గ్రామంలో సాగునీటికి ఇబ్బందులు తొలగిపోవడంతో ఇతర రైతులు బీడు భూములను సాగులోకి తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని