logo

భాజపా, కాంగ్రెస్‌ బడేమియా, ఛోటేమియాలాంటివి

అబద్ధాల్లో భాజపా బడేమియా అయితే కాంగ్రెస్‌ ఛోటేమియా లాంటిదని, ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని, ఇద్దరూ కలసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

Updated : 13 Apr 2024 05:53 IST

ఎమ్మెల్యే హరీశ్‌రావు

 మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌: అబద్ధాల్లో భాజపా బడేమియా అయితే కాంగ్రెస్‌ ఛోటేమియా లాంటిదని, ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని, ఇద్దరూ కలసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో పుట్ల కొద్దీ వడ్లు పండితే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పుట్టెదు దుఃఖం మిగిలిందన్నారు. సిద్దిపేటలోని కొండ భూదేవిగార్డెన్స్‌లో పట్టణ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆయన ఎల్‌ఈడీ తెరపై గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాలు ఇచ్చిన హామీలను చూపారు. నాలుగు నెలల కాలంలోనే కాంగ్రెస్‌ పాలనపై విసుగు చెందారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఆలోచన చేసి ఓటేయాలని కాంగ్రెస్‌ మీద కోపంతో భాజపాకు ఓటేస్తే పెనం మీది నుంచి పొయ్యిల పడ్డట్లు అవుతది పరిస్థితి అన్నారు. భాజపా నాయకులు దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధపు వాగ్దానాలతో ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్‌రావు ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. భాజపా, కాంగ్రెస్‌లు ఒక్కటై కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను నిలిపారన్నారు. కలెక్టర్‌గా అనుభవం ఉన్న వెంకట్రామిరెడ్డికి జిల్లా భౌగోళిక పరిస్థితులు అన్ని తెలుసని, ఆయన కృషి వల్లే అగ్రభాగాన నిలిచిందన్నారు. అలాంటి వ్యక్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించి సిద్దిపేట పౌరుషం చూపాలన్నారు. కార్యకర్తలు ఎట్టిపరిస్థితుల్లో కూడా ఏమరపాటుగా ఉండొద్దన్నారు. అనంతరం పలు సంఘాల ప్రతినిధులు వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఉంటామని తీర్మాన పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బల్దియా అధ్యక్షురాలు మంజుల, ఉపాధ్యక్షుడు కనకరాజు, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

 పట్టణానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఆకుల బాలయ్య... నాయకం వెంకటలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా హరీశ్‌రావు వారి కుటుంబాలను పరామర్శించారు.

 నంగునూరు: ముండ్రాయి గ్రామానికి చెందిన భారాస యువజన విభాగం అధ్యక్షుడు, గ్రామ క్రికెట్‌ టీం కెప్టెన్‌, గీతా కార్మికుడు సాదుపల్లి జగదీశ్‌ మృతికి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మండల అధ్యక్షుడు లింగం గౌడ్‌, మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని