logo

సైబర్‌ మోసం కట్టడి కి వ్యూహం

‘సెల్‌ఫోన్‌కు వచ్చిన లింకును ఓపెన్‌ చేసి డబ్బులు పెట్టుబడిగా పెడితే అధిక లాభాలు వస్తాయని గుర్తు తెలియని వ్యక్తులు పంపిన సందేశాన్ని నమ్మి గుమ్మడిదల మండలం అన్నారానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మోసపోయాడు.

Updated : 13 Apr 2024 05:53 IST

ప్రతి పోలీసు స్టేషన్‌లో ‘వారియర్ల’కు బాధ్యతలు

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: ‘సెల్‌ఫోన్‌కు వచ్చిన లింకును ఓపెన్‌ చేసి డబ్బులు పెట్టుబడిగా పెడితే అధిక లాభాలు వస్తాయని గుర్తు తెలియని వ్యక్తులు పంపిన సందేశాన్ని నమ్మి గుమ్మడిదల మండలం అన్నారానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మోసపోయాడు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి రూ.1.78 లక్షలు నష్టపోయాడు. బాధితుడు వెంటనే సైబర్‌ క్రైమ్‌ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేయగా గుమ్మడిదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.’
హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో జిల్లా ఉండటంతో సైబర్‌ నేరాలు అధికంగా జరుగుతున్నారు. వీటిలో ఎక్కువ కేసులు పటాన్‌చెరు, అమీన్‌పూర్‌ పోలీసు సేషన్ల పరిధిలోనే ఉంటున్నాయి. వాటి ఛేదన పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఈ రెండు ఠాణాల పరిధిలో నిత్యం రెండు నుంచి మూడు కేసులు నమోదవుతున్నాయి. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, కార్మికులే ఎక్కువగా ఉంటున్నారు. అక్షర జ్ఞానం లేనివారు మోసపోతున్న ఘటనలకంటే.. చదువుకున్న బాధితులే ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో సైబర్‌(ఆన్‌లైన్‌) మోసాలకు చెక్‌ పెట్టడంపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి పోలీసు స్టేషన్‌లో సైబర్‌ వారియర్లను నియమించి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. కేసుల ఛేదనలో వీరిపాత్రే కీలకం.

నిత్యం పర్యవేక్షణ: జిల్లాలోని 29 పోలీసు స్టేషన్ల పరిధిలో సైబర్‌ నేరాలపై ‘1930’ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులపై సైబర్‌ వారియర్లు కేసు నమోదు చేస్తారు. ప్రతి రోజుల కేసుల వివరాలు, వారి దర్యాప్తు తీరుపై డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి పర్యవేక్షిస్తుంటారు. సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు సహాయకంగా ఉంటారు. ఫిర్యాదు అందిన వెంటనే పూర్తి వివరాలు తెలుసుకొని విచారణ చేస్తున్నారు. మరోసారి బాధితుడు మోసపోకుండా అవగాహన కల్పిస్తున్నారు.

సైబర్‌ వారియర్లకు చరవాణులు పంపిణీ చేస్తున్న ఎస్పీ రూపేష్‌


అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం..

సైబర్‌ నేరాలపై అవగాహన సదస్పులు నిర్వహిస్తున్నాం. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు, డెబిట్‌కార్డ్‌ పాస్‌వర్డులు ఇతరులకు చెప్పవద్దు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే మాటలు నమ్మవద్దు. సామాజిక మాధ్యమాల్లో బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పే వారి మాటలు నమ్మి అత్యాశకు పోయి మోసానికి గురికావద్దు. సైబర్‌ మోసానికి గురయిన బాధితులు వెంటనే ‘1930’కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. సైబర్‌ వారియర్లు కేసుల ఛేదనలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
- వేణుగోపాల్‌రెడ్డి, డీఎస్పీ, సంగారెడ్డి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని