logo

ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాసిన రైతులు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ సిద్దిపేట నియోజకవర్గంలో పలువురు రైతులు ఉత్తరాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

Published : 16 Apr 2024 01:19 IST

సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ సిద్దిపేట నియోజకవర్గంలో పలువురు రైతులు ఉత్తరాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం కొనుగోలు కేంద్రాలు, ఇతర చోట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉత్తరాలు రాసి పంపించారు. వరి ధాన్యానికి బోనస్‌ రూ.500, రైతు బంధు సాయం రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, రుణమాఫీ రూ.2 లక్షలు, రైతు బీమా అమలు సహా అకాల వర్షాలు, ఎండిపోయిన పంటలకు పరిహారంగా రూ.25 వేలు అందజేయాలంటూ విన్నవించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తయిన నేపథ్యంలో హామీలు నెరవేర్చాలని, లేదంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిస్తామని వివరించారు. సిద్దిపేట మార్కెట్‌ యార్డులో, పలు గ్రామాల్లో రాసిన పోస్టు కార్డులను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. రైతు సంఘాలు, భారాస నాయకులు మద్దతు తెలిపారు.

 

 

భారాస మద్దతు: హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ అన్నారు. చిన్నకోడూరు పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రంలో సోమవారం రైతులతో కలిసి ’్జ్య పోస్టుకార్డు ఉద్యమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులు రాశారు. అనంతరం రోజాశర్మ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, ధాన్యానికి రూ.500 బోనస్‌ ఎక్కడ అని ప్రశ్నించారు. సాగునీరందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ మాణిక్యరెడ్డి, వైస్‌ ఎంపీపీ పాపయ్య, భారాస రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, పాల్గొన్నారు. నంగునూరు మండలంలోనూ పలు గ్రామాల రైతులు సీఎంకు కార్డులు రాశారు. భారాస మండల శాఖ అధ్యక్షుడు లింగం గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని