logo

నిలువు.. గెలువు!

జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే. వచ్చే ఫలితం అంతిమ విజయం కాదు. విద్యాభ్యాసం, విజ్ఞానం.. సంస్కారాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయి. గరిష్ఠ మార్కులు, ఉత్తీర్ణతే.. ప్రతిభకు తార్కాణం కాదు.

Updated : 16 Apr 2024 06:23 IST

ఆశించని ఫలితం రాకపోయినా ఆందోళన చెందొద్దు
పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత అందరిదీ
న్యూస్‌టుడే, సిద్దిపేట, సంగారెడ్డి టౌన్‌, మెదక్‌, టౌన్‌, వికారాబాద్‌ కలెక్టరేట్‌

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ క్రికెట్‌ రంగంలో ఎంతో మందికి ఆరాధ్యదైవం. 16 ఏళ్లకే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందారు. ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అసాధారణ బ్యాటింగ్‌తో పరుగుల రారాజుగా కోట్ల మంది హృదయాల్లో చోటు దక్కించుకున్నారు. 12వ తరగతి వరకే చదువుకున్నారు.


ఫేస్‌బుక్‌.. సామాజిక మాధ్యమాల్లో తొలిస్థానం దీనిదే. దీని రూపకర్త జుకర్‌బర్గ్‌ చదువు మధ్యలోనే ఆపేశారు. సృజనాత్మకత ఆలోచనలతో అత్యున్నతస్థాయికి ఎదిగారు.


ఒరాకిల్‌ డేటాబేస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థను స్థాపించిన ల్యారీ ఎలీసన్‌ రెండు విశ్వవిద్యాలయాల్లో చదువును మధ్యలోనే ఆపేశారు. తన ఆలోచనలతో ఎదిగి ప్రముఖ వ్యాపారిగా పేరొందారు.

జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే. వచ్చే ఫలితం అంతిమ విజయం కాదు. విద్యాభ్యాసం, విజ్ఞానం.. సంస్కారాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయి. గరిష్ఠ మార్కులు, ఉత్తీర్ణతే.. ప్రతిభకు తార్కాణం కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుందని అందరూ గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. త్వరలో ఇంటర్‌, పదో తరగతి వార్షిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులు ఫలితం ఏదైనా ధైర్యంతో ముందుకు సాగాలి. ప్రత్యామ్నాయాలు  ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి.
పది ప్రధాన పరీక్షలు మార్చి 30న ముగిశాయి. ఇంటర్‌   ప్రస్తుతం వారంతా వేసవి సెలవుల్లో ఉన్నారు. ఇక ఈ నెలాఖరులోగా రెండింటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తయింది. ఈ తరుణంలో విద్యార్థుల్లో ఒత్తిడి దాగి ఉంటుంది. ఫలితం అటు, ఇటైనా తప్పుడు నిర్ణయాలతో కుటుంబాన్ని క్షోభకు గురిచేయొద్దు. క్షణికమైన చర్యను పక్కన పెట్టి.. ఎన్నో అవకాశాలు కలిగిన భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

అండగా నిలవాలి..

ప్రస్తుతం పోటీతత్వం పెరిగిన నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆశించిన ఫలితం రాక పలువురు ఒత్తిడికి గురైన సమయంలో తల్లిదండ్రులు, కుటుంబం అండగా నిలవాలి. కృషి, పట్టుదల ఉంటే.. మరోమారు సత్తా చాటవచ్చని, ఆసక్తి మేర ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని ప్రోత్సహించాలి.


అపార అవకాశాలు..

మ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో కేజీ నుంచి పీజీ వరకు.. సాధారణ, వృత్తి, సాంకేతిక, ఉన్నత, వైద్య, అటవీ, ఉద్యానం.. ఇతర అన్ని రంగాలకు సంబంధించిన విద్య అందుబాటులో ఉంది. పదో తరగతి అర్హతతో ఐటీఐ ట్రేడ్‌లు, పాలిటెక్నిక్‌ కోర్సులు సహా వివిధ రకాల శిక్షణ సంస్థల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ అనుత్తీర్ణులైనా వివిధ రకాల సంస్థల్లో వృత్తి నైపుణ్య అంశాలపై తర్ఫీదు పొందవచ్చు.


అందుబాటులో శిక్షణలు..

నాలుగు జిల్లాల్లో ఐటీఐ, ఐటీసీలు, పాలిటెక్నిక్‌ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఆయా వాటిల్లో వేలాది మంది చదువుతున్నారు. మరోవైపు వివిధ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణలు కొనసాగుతున్నాయి. పది, ఆలోపు విద్యార్హతతో సిద్దిపేటలోని యూనియన్‌ గ్రామీణ స్వయం ఉపాధి, సంగారెడ్డిలోని ఎస్‌బీఐ శిక్షణ సంస్థలు అందిస్తున్న కోర్సుల్లో చేరవచ్చు. న్యాక్‌, సెట్విన్‌ కేంద్రాలు పలు అంశాల్లో మెలకువలు నేర్పుతున్నాయి. వివిధ సంస్థలు వృత్తి నైపుణ్య కోర్సులు అందిస్తున్నాయి. ఏటా 10 వేల మందికి పైగా వీటిని ఉపయోగించుకుంటున్నారు. వెనుకబడిన వారు చదువులో మెరుగులు దిద్దుకొని రాణిస్తున్నారు.


గుర్తిద్దాం.. ప్రోత్సహిద్దాం..

సాధారణ చదువుతో భిన్నమైన రంగాల్లో విజయాలు సాధించి ఎంతోమందికి ఉపాధి కల్పించే వారు అనేకం. ఈ దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, కుటుంబీకులదే. స్థాయికి మించి చదివిస్తూ.. ఒత్తిడి పెంచుతున్నారు. ఫలితమేదైనా అండగా ఉంటామనే వాతావరణం కల్పించాల్సి ఉంది. మరో అవకాశం ఉంటుందనే భరోసా కల్పించాలి. ఆసక్తి ఉన్న రంగాల వైపు ప్రోత్సహించాలి.


దృష్టిసారించి..

  • పిల్లలకు తల్లిదండ్రులు, కుటుంబం మానసిక ధైర్యం ఇవ్వాలి. మార్కులు, ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా ఫలితం ఏదైనా భరోసా కల్పించాలి.
  • తక్కువ, ఎక్కువ అని ఇతరులతో పోల్చవద్దు.
  • సున్నిత మనస్తత్వం నుంచి దూరం చేయాలి. నాయకత్వ లక్షణాలు పెంచాలి.
  • చదువే లోకంగా బావించొద్దు. ఆశావహ దృక్పథం కలిగి ఉండాలి. మరో అవకాశం ఉందనే విషయాన్నే మరువొద్దు.
  • ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు.

నిరుత్సాహం వద్దు..

- ఉమాపతి, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, సిద్దిపేట

ప్రస్తుతం అన్ని రంగాలకు విపరీత డిమాండ్‌ పెరిగింది. నైపుణ్యాలు పెంచుకొని ప్రావీణ్యం సాధిస్తే ఉన్నతస్థాయికి చేరవచ్చు. బాల్యం నుంచే తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు ఇతర అంశాల వైపు ప్రోత్సహించాలి. ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపర్చొద్దు. ఒకవేళ అనుత్తీర్ణులైతే మరోమారు పరీక్షలకు సన్నద్ధం చేస్తూనే వృత్తి విద్యాకోర్సుల వైపు మళ్లించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని