logo

అపజయాలే విజయానికి మెట్లుగా..

ఉన్నత లక్ష్య సాధనకు కఠోరంగా శ్రమించాలి.. తాత్కాలిక ఆనందాలను పక్కనపెట్టాలి.. అపజయాలు లెక్క చేయక ముందుకు సాగాలి

Updated : 17 Apr 2024 06:04 IST

ఐపీఎస్‌ శిక్షణలో కొనసాగుతూనే లక్ష్యం చేరిక

శిక్షణలో అఖిల్‌

న్యూస్‌టుడే, సిద్దిపేట, కొండపాక గ్రామీణం: ఉన్నత లక్ష్య సాధనకు కఠోరంగా శ్రమించాలి.. తాత్కాలిక ఆనందాలను పక్కనపెట్టాలి.. అపజయాలు లెక్క చేయక ముందుకు సాగాలి.. ఇలా చేసిన గ్రామీణ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఓ యువకుడు సివిల్‌ సర్వీసెస్‌ సాధించి తల్లిదండ్రులు సగర్వంగా నిలిచేలా చేశారు. అతడే సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన బుద్ధి అఖిల్‌. అఖిల భారత స్థాయిలో 321వ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. వైఫల్యాలకు వెరవకుండా లోపాలు బేరీజు వేసుకొని ఐదో ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించడం విశేషం.

 కొండపాకకు చెందిన బుద్ధి లలిత, నరేశ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయమే జీవనాధారం. నరేశ్‌ సిద్దిపేటలో 28 ఏళ్లు కాంపౌండర్‌గా పని చేశారు. మూడేళ్లుగా కొండపాకలో పీఎంపీగా చేస్తూ సాగును వదల్లేదు. పెద్ద కుమారుడు అఖిల్‌ (26) మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. చిన్నకుమారుడు అజయ్‌ డిగ్రీ పూర్తి చేశారు. అఖిల్‌ ఇంటర్‌ వరకు సిద్దిపేటలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకున్నారు. పదిలో 9.8 జీపీఏ, ఇంటర్‌ (ఎంపీసీ) 972 మార్కులు సాధించారు. వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయంలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకున్నారు. 85 శాతం మార్కులతో సత్తా చాటారు. ఈ యువ కెరటం.. బాల్యంలోనే ఐఏఎస్‌ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఐఏఎస్‌ స్మితాసబర్వాల్‌ ఉమ్మడి మెదక్‌ కలెక్టర్‌గా పని చేసినప్పుడు అఖిల్‌ ఏడో తరగతి చదువుతున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, తండ్రి ప్రోత్సాహంతో సివిల్‌ సర్వీసెస్‌ సాధనే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ఇంటి నుంచే సన్నద్ధం..

2018లో ఇంజినీరింగ్‌ పూర్తవగానే యూపీఎస్సీకి సిద్ధమయ్యారు. ఇంట్లో నుంచే చదివారు. 2019లో తొలి యత్నంలో ఆశించిన ఫలితం దక్కలేదు. 2020లో ఇదే అనుభవం ఎదురైంది. 2021లో 566వ ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐఏఎస్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్న అఖిల్‌ శిక్షణకు వెళ్లకుండా ఏడాది పాటు సెలవు తీసుకున్నారు. 2022లో మరోమారు యత్నించగా నిరాశే మిగిలింది. 2023లో పరీక్ష రాశారు. గతేడాది డిసెంబరులో ఐపీఎస్‌ శిక్షణకు పయనమయ్యారు. మెరుగైన ఫలితాలు సాధించి విరామ సమయంలో సన్నద్ధమై గత జనవరిలో ముఖాముఖికి హాజరయ్యారు.

పొలం పనుల్లోనూ..

అఖిల్‌ తండ్రి నరేశ్‌ పది, తల్లి లలిత ఏడో తరగతి చదివారు. తమ పిల్లలు కష్టపడొద్దని, చదివిస్తే ఉన్నతస్థాయిలో ఉంటారనే కాంక్షతో ప్రోత్సహించారు. అఖిల్‌ రోజులో 10 నుంచి 12 గంటల సమయాన్ని కేటాయించారు. వ్యవసాయ పనుల్లోనూ పాలుపంచుకున్నారు. అన్ని వేడుకలకు దూరంగా ఉన్నారు. లక్ష్య సాధన తర్వాత అందర్నీ కలవవచ్చనే ఆశావహ దృక్పథంతో శ్రమించారు. ఇష్టమైన క్రికెట్‌నూ దూరం పెట్టారు.


ఆనందంతో ఎగిరి గంతేశా..
   - నరేశ్‌, అఖిల్‌ తండ్రి

సంతోషంగా ఉంది. మా కుటుంబంలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే గొప్ప అనే భావన ఉండేది. నా కొడుకు మంగళవారం మధ్యాహ్నం ఫోన్‌ చేసి ‘బాపూ నేను ఐఏఎస్‌ సాధించా’నని చెప్పగానే ఆనందంతో ఎగిరి గంతేశా. ఆనంద భాష్పాలతో నోట మాట రాలేదు. మా బలగంలో తొలి ప్రభుత్వ, ఉన్నత ఉద్యోగం ఇదే. అతడి కష్టం ఫలించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు