logo

శ్రీరామ యశస్సు.. ఆచరణతో ఉషస్సు

శ్రీరాముడు ప్రజలందరికీ.. ఆదర్శప్రాయుడు. సకల గుణ సంపన్నుడిగా కీర్తింపబడ్డారు. తరగని సుగుణాలతో ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారు. రామరాజ్యం.. శ్రీరామరక్ష.. అనే పదాలు తరచూ వినిపిస్తుంటాయి.

Updated : 17 Apr 2024 06:05 IST

రామ చంద్రుడి స్ఫూర్తిగా అభ్యర్థులు, ఓటర్లు కదలాలి..

శ్రీరాముడు ప్రజలందరికీ.. ఆదర్శప్రాయుడు. సకల గుణ సంపన్నుడిగా కీర్తింపబడ్డారు. తరగని సుగుణాలతో ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారు. రామరాజ్యం.. శ్రీరామరక్ష.. అనే పదాలు తరచూ వినిపిస్తుంటాయి. ఆదర్శమూర్తిగా.. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారంగా పండితులు చెబుతుంటారు. లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆ నీల మేఘశ్యాముడి గుణగణాలను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. పోటీ చేయనున్న నేతలు.. ఓటర్లు.. స్ఫూర్తిని స్మరించాల్సిన సమయమిది. నేటి శ్రీరామనవమి సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

 ధర్మానికి ప్రతిరూపం..

 ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ రాముడి వ్యక్తిత్వాన్ని గురించి రావణాసురుడికి చెబుతూ శత్రువైన మారీచుడు పలికిన మాటలివి. దీనర్థం.. ధర్మానికి రూపం రాముడే. ధర్మాన్ని ఎలా ఆచరించాలి.. ఎలా జీవించాలో చూపారు. క్లిష్ట సమయంలోనూ భేదాలు చూపలేదు. ఆ ఆదర్శ మూర్తి పాలనలో.. ప్రజలు తమ సమస్యలు విన్నవించేలా గంట మోగించే విధానాన్ని పాటించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు.. ధర్మానికి కట్టుబడి ఉండాలి. తనపర భేదం లేకుండా.. పాలన అందిస్తాననే భరోసా కల్పించాలి. ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మార్పు రావాల్సి ఉంది. గెలుపొందాక నాయకులు సాంకేతిక మాధ్యమాలు, మరో మార్గంలోనైనా ప్రజలు కలిసే అవకాశం కల్పించాలి.

మాట తప్పని నైజం..

శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. తండ్రి ఆదేశాలతో విశ్వామిత్రుడి వద్దకు వెళ్లారు. ఇచ్చిన మాటను ఎన్నడూ తప్పలేదు. వారి స్ఫూర్తితో పాతతరం నేతలు ఎంతో మంది ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఔరా అనిపించారు. అప్పటి నేతల పనితీరును ప్రజలు ఇప్పటికి గుర్తు చేసుకుంటారు. ప్రస్తుత నాయకులు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారనే విమర్శలు ప్రజల్లో తరచూ వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు క్రతువు దాటే వరకు ఇదో ఆయుధంగా మారుతోంది. ఆచరణకు సాధ్యం కాని అంశాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నారు. మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. హామీలను నెరవేర్చుతామనే వైఖరిని ప్రస్పుటం చేయాలి. ప్రజల్లో ఆశావహ దృక్పథాన్ని పెంచాలి.


అసామాన్య బంధం..

రామ, లక్ష్మణ, భరత, శత్రజ్ఞుల బంధం అసామాన్యం. వనవాస సమయంలో సోదరుడైన భరతుడు రాముడి పేరిటే పాలించారు. ప్రస్తుతం అన్నదమ్ములు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. విభేదాలు తలెత్తుతున్నాయి. పదవులు చేజిక్కించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తున్నారు. రాముడి స్ఫూర్తిగా తమ బంధాన్ని పదిలం చేసుకోవాలి.

ప్రత్యర్థిని ప్రశంసించే తత్వం..

రాముడు.. ప్రత్యర్థి రావణుడిని సైతం ప్రశంసించారు. రావణ బ్రహ్మకు ఉన్న అపార జ్ఞానం, శివుడిపై భక్తి గుణాన్ని మెచ్చుకున్నారు. రావణ వధ తరువాత స్వర్ణమయమైన లంకను ఏమాత్రం ఆశించలేదు. ప్రస్తుతం రాజకీయాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారం, ఇతర సందర్భాల్లో పరస్పర విమర్శలతో కాలం నెట్టుకొస్తున్నారు. ధూషణలతో అదరగొడుతున్నారు. ఈ పరిణామాలతో రాజకీయమంటే ప్రజలకు విరక్తి కలగక మానదు. మరోవైపు ప్రభుత్వాలు.. ప్రజాప్రతినిధులు.. ఎవరికి వారుగా తమ ముద్ర వేసుకునే ప్రయత్నంలో సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. ఒకరి పనులను మరొకరు అర్ధాంతరంగా నిలిపివేస్తున్న ఉదంతాలు పరిపాటిగా మారాయి. ఫలితంగా ప్రజాధనం వృథా అవుతుంది. ప్రస్తుత తరుణంలో ప్రత్యర్థిని ప్రశంసించకున్నా.. వారి వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.

నిరాడంబరమే అలంకారం..

అయోధ్యకు రాజుగా ప్రకటించిన తరువాత పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో తండ్రి మాటను జవదాటకుండా వనవాసానికి వెళ్లారు. నిరాడంబర జీవితాన్ని కొనసాగించారు. కాషాయ వస్త్రధారణతో సరిపెట్టుకున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు వదిలి కందమూలాలు తిన్నారు. అరణ్యంలో ముళ్లదారులను అధిగమిస్తూ కఠినతర జీవనాన్ని కొనసాగించారు. కటిక నేలపై నిద్రించారు. రాళ్లనే రాజసింహసంగా మార్చుకున్నారు. ప్రస్తుత నేతలు.. నిరాడంబర జీవితానికి అలవాటుపడాలి. ప్రజాధనం వృథా చేయకుండా.. డబ్బు, పరపతిని ప్రదర్శించకుండా ముందడుగు వేయాలి. అంతిమంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భావించాలి. అందుకు ఎంత దూరమైనా వెళ్లగలిగే ఓర్పు కలిగి ఉండాలి.

అప్పుడే రామరాజ్యం సాకారం..

ఉత్తమ పాలనను రామరాజ్యంతో పోలుస్తుంటారు. ఆ రాజ్యం రావాలంటూ ఆకాంక్షిస్తుంటారు. నిజాయతీ, నిర్భీతి, సత్యమార్గంలో రాముడు పాలన కొనసాగించారు. రాజ్య రక్షణకు పాటుపడే వారిని వివిధ హోదాల్లో నియమించారు. శాస్త్రాలను అనుసరించారు. ఆ రామరాజ్యం మన దగ్గరా సాకారం కావాలంటే.. ఓటరు పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంది. ప్రలోభాలకు లొంగకుండా సరైన నిర్ణయం తీసుకొని తీర్పునిస్తే చక్కటి పాలన అందే అవకాశం లేకపోలేదు. ఒకవేళ లొంగితే.. ఐదేళ్లు కష్టపడాల్సిందే. ప్రజాప్రతినిధిని అడిగే హక్కును కోల్పోతారు.

సరైన నిర్ణయం.. సుఖసంతోషాల మయం..

రాఘవుడు తన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు వేగుల ద్వారా పాలనపై ఆరా తీసేవారు. అవసరాలకు అనుగుణంగా ప్రజలకు అన్ని వసతులు కల్పించారు. సంక్షోభానికి తావులేకుండా పాలనను కొనసాగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లు.. వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు మంచి చేసే విషయాన్ని పక్కనపెట్టి ఆకర్షించే యత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో చక్కగా పాలన అందిస్తారనే నమ్మకం ఉన్న వారిని ఎన్నుకోవాలి.


ఓటు హక్కు.. రామబాణం వంటిది.

తిరుగులేని నేత ఎన్నిక కావాలంటే.. సరైన రీతిలో సంధించాలి. ప్రతి ఒక్కరు గడపదాటి తమ బాధ్యతను నిర్వర్తించాలి. వేరే ఊర్లో ఉన్నామనో.. కేంద్రం దగ్గర లేదనో.. అభ్యర్థులు నచ్చలేదనే సాకులతో హక్కును కాలరాయొద్దు. అభ్యర్థులు నచ్చని పక్షంలో ‘నోటా’ ఉందనే విషయాన్ని విస్మరించొద్దు. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో వివిధ సందర్భాల్లో పోలింగ్‌ శాతం తగ్గుతోంది. ఇది ఆలోచించాల్సిన విషయం. అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా ముందుకు కదిలితే శతశాతం సాధ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని