logo

మెతుకు సీమకు రుణపడి ఉంటాం

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. అధికార పార్టీపై  విమర్శలు గుప్పిస్తూ గులాబీ దళపతి కేసీఆర్‌ ప్రసంగం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కళాకారుల ఆటాపాట ఉర్రూతలూగించింది.

Updated : 17 Apr 2024 05:59 IST

సంగారెడ్డి టౌన్‌, జోగిపేట, జోగిపేట టౌన్‌, పుల్కల్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లాలో మంగళవారం నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. అధికార పార్టీపై  విమర్శలు గుప్పిస్తూ గులాబీ దళపతి కేసీఆర్‌ ప్రసంగం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కళాకారుల ఆటాపాట ఉర్రూతలూగించింది. ప్రాంగణమంతా గులాబీ జెండాలు, కేసీఆర్‌, కేటీఆర్‌ కటౌట్లతో నిండిపోయింది. సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించేందుకు తన ప్రస్థానం ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచే ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తనకు ప్రజలు ఏ విధంగా మద్దతు ఇచ్చారో అదే స్ఫూర్తిని గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలకు 7 స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించినందుకు రుణపడి ఉంటానన్నారు. కాంగ్రెస్‌ పాలనలో సింగూరు నీటిని స్థానిక అవసరాలను విస్మరించి హైదరాబాద్‌కు తరలించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే సింగూరు నీటిని జిల్లాలోని సాగు, తాగు నీటి అవసరాలకు వినియోగించామన్నారు. కాలువలను పూర్తిచేసి రెండు పంటలకు నీరందించింది తామేనని గుర్తుచేశారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారని విమర్శించారు. భాజపాకు ఓటు వేస్తే మంజీరా నదిలో వేసినట్టేనని పేర్కొన్నారు.

ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్‌, చిత్రంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల అభ్యర్థులు  వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్‌ కుమార్‌ తదితరులు


 ఆరు గ్యారంటీలే కాంగ్రెస్‌ను మట్టుబెడతాయ్‌

 - మాజీ మంత్రి హరీశ్‌రావు


కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలే గడ్డపారలై, ఈ ఎన్నికల్లో ఆ పార్టీని మట్టుబెడతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన వంద రోజుల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే డిసెంబరు 9న రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అన్నారు కదా, మరి ఇపుడు ఏమైందన్నారు? మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఇస్తామన్నారు. రైతులకు క్వింటాకు రూ.500 బోనస్‌ వంటి వాటిని ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కేవలం ఎన్నికల్లో గెలుపొందేందుకే అమలుకు సాధ్యం కానీ హామీలతో గడ్డన పడ్డారని ఎద్దేవా చేశారు. రైతు బంధు కింద ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఆ మాటను వారు నిలబెట్టుకోలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే, మళ్లీ ఇపుడు ఓట్లు అడగడానికి వస్తున్నారని ఈ సమయంలోనే మీరంతా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇపుడు కూడా మోసపోయి ఓట్లు వేసి గెలిపిస్తే వారిని ప్రశ్నించే గొంతులు, నిలువరించే పార్టీలు ఉండవన్నారు. మీకిచ్చిన హామీలు అమలు చేయించాలంటే ఈ ఎన్నికల్లో భారాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అపుడే కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలువంచే బలం మాకు వస్తుందన్నారు. నాలుగు నెలలకే కరెంటు, తాగు, సాగు నీళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత, కేసీఆర్‌ కిట్ల కొరత వంటి ఇబ్బందులు తలెత్తాయన్నారు.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు ఓట్ల కోసం మీ ఇంటి ముందుకొస్తే తరిమికొట్టండని పిలుపునిచ్చారు. ఇక పదేళ్లలో ప్రజలకు ఏ ఒక్క మంచి పథకాన్ని భాజపా అమలు చేయలేదన్నారు. ఇపుడు ఓట్లకోసం తిరుగుతోందని దుయ్యబట్టారు.


ప్రజా ఆశీర్వాద సభ పదనిసలు

ః సభాస్థలికి కేసీఆర్‌ రాత్రి 7 గంటలకు వచ్చారు. 7.05 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి 7.35కు పూర్తి చేశారు. అరగంట పాటు ప్రసంగించారు. ః కేసీఆర్‌ హెలికాప్టర్‌లో వస్తారని భావించగా, ఆయన రోడ్డు మార్గంలో సభాస్థలికి చేరుకున్నారు.  ః జనాలు పలుమార్లు బారీకేడ్లను తోసుకొని దూసుకు వస్తుండడంతో వారిని అందోలు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ వారించారు.  ః సభికులను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తన ఆటాపాటలతో అలరించారు.  ః కొందరు యువకులు సీఎం కేసీఆర్‌.. సీఎం కేసీఆర్‌ అంటూ నినాదాలు చేయగా.. వద్దంటూ మాజీ ముఖ్యమంత్రి వారిని వారించారు.  ః ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ‘ఆరు పథకాలు గోవిందా.. కాంగ్రెస్‌ పార్టీ గోవిందా’ అని పాడిన పాట సభికులను ఆకట్టుకుంది.  ః తెలంగాణ పాటలకు పార్టీ కార్యకర్తలు నృత్యాలు చేశారు.  ః నాగలి నమూనాను జోగిపేట మాజీ ఏఎంసీ అధ్యక్షుడు పల్లె సంజీవయ్య సభా వేదికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు.  ః మాజీ సీఎం తన ప్రసంగంలో పలుమార్లు లిల్లీపుట్‌గాళ్లు అంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు.  ః సభ అనంతరం కేసీఆర్‌ వెళుతున్న వాహనాన్ని భారాస నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు. వారిని పోలీసులు పక్కకు తప్పించి వాహనానికి దారిచ్చారు.

పాలిచ్చే గేదెను కాదనుకుని..

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మాజీ సీఎం కేసీఆర్‌కు మించినోళ్లు ఎవరూ లేరు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు జరిగింది, ఇపుడు మళ్లీ చేయకుండా ఓట్లు వేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పాలిచ్చే గేదెను కాదనుకుని.. తన్నించుకునే దున్నపోతును తెచ్చుకున్నామన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ సారి అలా చేయకుండా, పాలిచ్చే గేదెను తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. జహీరాబాద్‌లో పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి బీబీ పాటిల్‌ పదేళ్ల పాటు భారాసలోనే ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఏ గ్రామంలో చిన్నపాటి అబివృద్ధి చేయలేదు. అలాంటి వ్యక్తి ఇపుడు భాజపా తరఫున ఇంకేం చేస్తారు. ఈ సారి తప్పకుండా మెదక్‌, జహీరాబాద్‌ భారాస అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌లను గెలిపించాలి. - మాజీ సభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి.


జై తెలంగాణ అని పలకని వ్యక్తి మన సీఎం: దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ

తెలంగాణకు వెకిలి సీఎం వచ్చారు. ఇప్పటి వరకు జై తెలంగాణ అని పలకని వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావడం  అవమానకరం. అమరవీరుల స్తూపం వద్ద ఇప్పటి వరకు నివాళి అర్పించలేదు. హనుమంతుడి ఛాతీలో శ్రీరాముడు కనిపిస్తే, సీఎం రేవంత్‌రెడ్డి ఛాతీలో చంద్రబాబు కనిపిస్తారు. తెలంగాణలో తెదేపాను నామరూపాలు లేకుండా చేసినందుకే కేసీఆర్‌ అంటే రేవంత్‌కు కోపం. రసమయి బాలకిషన్‌ ధూంధాం సభికులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సునీతారెడ్డి, మాణిక్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, మాజీ కార్పొరేషన్‌ అధ్యక్షులు మఠం భిక్షపతి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, నాయకులు ప్రతాప్‌రెడ్డి,, జైపాల్‌రెడ్డి, పి.నారాయణ, లింగాగౌడ్‌, ఎం.విజయ్‌కుమార్‌, రాజేందర్‌, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని