logo

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు: సీపీ

గంజాయి, మాదకద్రవ్యాల వినియోగాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని పోలీసు కమిషనర్‌ అనూరాధ తెలిపారు. సైబర్‌నేరాల్లో నిలిపివేసిన నగదును త్వరగా బాధితులకు ఇప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

Published : 21 Apr 2024 00:58 IST

సిద్దిపేట టౌన్‌: గంజాయి, మాదకద్రవ్యాల వినియోగాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని పోలీసు కమిషనర్‌ అనూరాధ తెలిపారు. సైబర్‌నేరాల్లో నిలిపివేసిన నగదును త్వరగా బాధితులకు ఇప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. కమిషనరేట్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న  కేసులపై ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో శనివారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆమె పలు సూచనలు చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల పట్టణంలోని ఓ వ్యవసాయి బావిలో పడి యుకువడు దుర్మరణం పాలుకాగా వెతికి మృతదేహాన్ని బయటకు తీసిన ఏఎస్సై ఉమారెడ్డిని సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు.

జల్సాలకు అలవాటై చోరీలు.. ఇద్దరి అరెస్టు

సిద్దిపేట టౌన్‌: జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించేందుకు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వివరాలను కమిషనరేట్‌లో సీపీ అనూరాధ శనివారం వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన ములకలపల్లి వెంకన్న గజ్వేల్‌లో ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 13న ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లగా చోరీకి పాల్పడి ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. కేసును ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐ సైదా దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి శనివారం పట్టణంలో అరెస్టు చేశారు. నిందితులు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన షరీఫ్‌, తవాబ్‌గా గుర్తించారు. కొన్నాళ్ల కిందట గజ్వేల్‌కు వచ్చి ఇద్దరూ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నారు. జల్సాలకు డబ్బు అవసరమై దొంగతనం కోసం పట్టణంలో రెక్కీ నిర్వహించి చేశారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.

గొలుసు దుకాణాల్లో మద్యం స్వాధీనం

నంగునూరు: గట్లమల్యాలలో గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు, రాజగోపాలపేట పోలీసులతో కలిసి శనివారం దాడులు నిర్వహించారు. పోగుల సతీశ్‌ ఇంట్లో నిల్వచేసిన 36.920 లీటర్ల మద్యం సీసాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై భాస్కర్‌ రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని