logo

పార్టీల వ్యూహాలు.. గెలుపుపైనే ఆశలు

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే ప్రచారంలోకి దిగిన మూడు ప్రధాన పార్టీలు జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.

Updated : 21 Apr 2024 06:53 IST

అసెంబ్లీ ఫలితాలు విశ్లేషించుకుంటూ ముందుకెళ్తున్న నాయకులు 

ఈనాడు, కామారెడ్డి, న్యూస్‌టుడే, జహీరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే ప్రచారంలోకి దిగిన మూడు ప్రధాన పార్టీలు జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం భారాస, కేంద్రంలో హ్యాట్రిక్‌ సాధించేందుకు భాజపాలు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే అధికంగా సాధించేలా ఆయా పార్టీలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.

ప్రత్యేక దృష్టి..

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా అభ్యర్థి ఇంటింటికీ తిరిగి ఓటు అభ్యర్థించే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలను పోలింగ్‌ కేంద్రాల వారీగా విశ్లేషిస్తూ అభ్యర్థులు ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు. తక్కువగా ఓట్లు వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతాన్ని కూడా పరిశీలిస్తూ మెరుగ్గా ఫలితం వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

అంతా తామై వ్యవహరిస్తూ..

అధికార కాంగ్రెస్‌, భారాస పార్టీల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులే ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ బాధ్యులకు లక్ష్యాలను నిర్దేశిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించారు. భారాస అధినేత కేసీఆర్‌ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓటమి చెందిన అభ్యర్థులకు నియోజకవర్గ ఇన్‌ఛార్జీలుగా నియమించి ప్రచార బాధ్యతలు చేపట్టాలని నిర్దేశించారు. దీంతో అంతా తామై వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మెజారిటీని పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఓటమి చెందిన అభ్యర్థులు లోపాలను సరిదిద్దుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధిష్ఠానం వద్ద తమ సత్తా చాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భాజపా నాయకులు కేంద్రంలో మోదీ అందించిన  పాలనను వివరిస్తూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన కార్యాచరణతో ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు