logo

స్థానికేతరులకే పట్టం

ఏదైనా స్థానం నుంచి పోటీ చేసే సమయంలో స్థానికత, స్థానికేతర అంశాలు చర్చనీయాంశంగా ఉంటాయి. గెలుపోటముల్లోనూ ఈ అంశం ప్రభావం చూపుతుంటుంది.

Published : 21 Apr 2024 01:11 IST

మెదక్‌ ఖిల్లా...

ఏదైనా స్థానం నుంచి పోటీ చేసే సమయంలో స్థానికత, స్థానికేతర అంశాలు చర్చనీయాంశంగా ఉంటాయి. గెలుపోటముల్లోనూ ఈ అంశం ప్రభావం చూపుతుంటుంది. చారిత్రక నేపథ్యం ఉన్న మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు గెలిచిన వారిలో నలుగురు తప్ప మిగతా వారంతా ఇతర జిల్లాల వారే కావడం గమనార్హం. 1952లో నియోజకవర్గం ఏర్పడగా, తొలి ఎంపీ ఎన్‌.ఎం.జయసూర్య నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ వరకు, ఆ తర్వాత ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆలే నరేంద్ర, విజయశాంతిలు సైతం స్థానికేతరులే. ఎన్‌.ఎం జయసూర్య, హన్మంత్‌రావు, సంగం లక్ష్మిబాయి సికింద్రాబాద్‌కు చెందిన వారు. 1971లో గెలుపొందిన డా.మల్లికార్జున్‌ స్వస్థలం మహబూబ్‌నగర్‌. ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కాగా, 1999లో భాజపా తరఫున గెలిచిన ఆలే నరేంద్ర, 2009లో తెరాస నుంచి గెలుపొందిన విజయశాంతి హైదరాబాద్‌వాసులే కావడం గమనార్హం.

ఉమ్మడి జిల్లా నుంచి...

ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు నలుగురే ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. 1984లో తెదేపా నుంచి గెలిచిన ఎంపీ మాణిక్‌రెడ్డి సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం డాకూర్‌ కాగా, 1989 నుంచి 1999 వరకు వరుసగా నాలుగు సార్లు విజయాలు సాధించిన ఎం.బాగారెడ్డ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌. 2014లో ఎంపీగా ఉన్న కేసీఆర్‌ స్వస్థలం సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలం చింతమడక. దుబ్బాక మండలం పోతారానికి చెందిన కొత్త ప్రభాకర్‌రెడ్డి 2014 ఉప ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసి విజయం అందుకున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న రఘునందన్‌రావు (భాజపా) సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం బొప్పాపూర్‌ స్వగ్రామం కాగా, నీలం మధు (కాంగ్రెస్‌) సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కూల్‌కు చెందిన వారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు.          

 న్యూస్‌టుడే, మెదక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని