logo

సిద్దిపేట.. నాలుగు దశాబ్దాల కోట

2008 వరకు సిద్దిపేట లోక్‌సభ స్థానంగా కొనసాగింది.. ఎంతోమంది నేతలు ఇక్కడి నుంచి గెలిచి ఎంపీలుగా కొనసాగారు.

Published : 21 Apr 2024 01:13 IST

 పునర్విభజనతో ఉనికి కోల్పోయిన లోక్‌సభ స్థానం
న్యూస్‌టుడే, సిద్దిపేట 

2008 వరకు సిద్దిపేట లోక్‌సభ స్థానంగా కొనసాగింది.. ఎంతోమంది నేతలు ఇక్కడి నుంచి గెలిచి ఎంపీలుగా కొనసాగారు. స్వరాష్ట్ర ఉద్యమ పురిటిగడ్డ కేంద్రంగా నాలుగు దశాబ్దాలకు పైగా ప్రస్థానం కలిగిన ఈ ప్రాంతం ఎన్నో విశేషాల సమాహారం. 11 మార్లు ఎన్నికలు జరుగగా.. ఐదుగురు ప్రాతినిధ్యం వహించారు. ఎస్సీ రిజర్వుడ్‌ పార్లమెంటరీ స్థానంగా రాజకీయ చిత్ర పటంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. పునర్విభజనలో భాగంగా 2009లో ఈ స్థానం రద్దయి మెదక్‌లో విలీనమైంది.

1952లో లోక్‌సభ నియోజకవర్గాలు ఆవిర్భవించగా.. సిద్దిపేట ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం మాత్రం 1967లో ఏర్పాటవగా.. అప్పట్లోనే తొలిఎన్నికలు జరిగాయి. ముందుగా కాంగ్రెస్‌ నుంచి కాకా (జి.వెంకటస్వామి) ఎంపీగా గెలుపొందారు. ముగ్గురు నేతలు రెండు, అంతకుమించిన సార్లు విజయాలు అందుకున్నారు. 2004లో చివరిసారిగా ఎన్నికల క్రతువు చేపట్టారు. 2008లో నియోజకవర్గ పునర్విభజనలో రద్దు కాగా 2009 ఎన్నికల నుంచి అమల్లోకి రావడం గమనార్హం. ఈ స్థానానికి చివరి ఎంపీగా సర్వే సత్యనారాయణ చరిత్ర పుటల్లో నిలిచారు.

రూపు మారి..

అప్పటి సిద్దిపేట పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో సిద్దిపేటతో పాటు దొమ్మాట, రామాయంపేట, నర్సాపూర్‌, గజ్వేల్‌, మేడ్చల్‌, కంటోన్మెంట్‌ శాసనసభ నియోజకవర్గాలు ఉండేవి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సమీపంలోనే ఇవన్నీ ఉన్నాయి. సైనిక సంస్థలు, కుటుంబాలు ఉండే ప్రాంతంగా కంటోన్మెంట్‌కు ప్రత్యేకత ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో దొమ్మాట శాసనసభ నియోజకవర్గం దుబ్బాకగా రూపాంతరం చెందగా.. రామాయంపేట నియోజకవర్గం రద్దయి మెదక్‌ పరిధిలో చేరింది. గతంలో సిద్దిపేట ఎంపీ స్థానం పరిధిలో ఉన్న సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, నర్సాపూర్‌లు ప్రస్తుతం మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి. కంటోన్మెంట్‌, మేడ్చల్‌ నియోజకవర్గాలు మల్కాజిగిరి పరిధిలోకి చేరాయి.

అనూహ్య పరిణామాలు..

2016 అక్టోబరు 11న సిద్దిపేట, మేడ్చల్‌ జిల్లా కేంద్రాలుగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అభివృద్ధిలో ఈ రెండూ ప్రత్యేకతను చాటాయి. సిద్దిపేట బిడ్డ, గజ్వేల్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్‌ రెండు మార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఒకప్పుడు సిద్దిపేట ద్వితీయ శ్రేణి పురపాలికగా ఉండగా.. ప్రస్తుతం ప్రత్యేక శ్రేణి హోదాతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిద్దిపేట పట్టణం సహా 26 గ్రామాలతో సుడా (సిద్దిపేట అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటైంది. గజ్వేల్‌, నర్సాపూర్‌ 2016లో డివిజన్‌ కేంద్రాలుగా ఏర్పాటయ్యాయి. గజ్వేల్‌ సహా దుబ్బాక, రామాయంపేట, నర్సాపూర్‌, తూప్రాన్‌ పురపాలికలుగా అవతరించాయి.

  •  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నంది ఎల్లయ్య గరిష్ఠంగా ఐదుసార్లు ఎంపీగా విజయం సాధించారు.
  •  కాంగ్రెస్‌ నేత కాకా, తెదేపా నేత మల్యాల రాజయ్య రెండుమార్ల చొప్పున గెలుపొందారు.
  •  తెదేపా నేత విజయరామారావు, కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ ఒక్కోసారి ప్రాతినిధ్యం వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు