logo

అందని భత్యం.. పేదలపై భారం

పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యాహక్కు చట్ట ప్రకారం ప్రభుత్వం వారికి రవాణా భత్యం అందజేస్తోంది.

Published : 21 Apr 2024 01:14 IST

రవాణా ఛార్జీలకు రెండేళ్లుగా విద్యార్థుల ఎదురుచూపులు 

ఆటోల్లో పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు

పెద్దశంకరంపేట, న్యూస్‌టుడే: పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యాహక్కు చట్ట ప్రకారం ప్రభుత్వం వారికి రవాణా భత్యం అందజేస్తోంది. ఈ భత్యం విద్యార్థులకు సకాలంలో విడుదల కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. బస్సు సౌకర్యం లేని పలు గ్రామాల విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లో, కాలినడకన వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. ఇతర గ్రామాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లిస్తోంది. అయితే రెండేళ్లుగా ఈ భత్యం బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

కూలీ పనులు చేసుకొని.. జిల్లాలోని 21 మండలాల పరిధిలోని మొత్తం 890 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 86,238 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో కస్తూర్బా మినహా మిగతా అన్ని పాఠశాలలకు విద్యార్థులు ఇళ్ల నుంచి వచ్చి వెళ్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారంతా ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే. బస్సు సౌకర్యం లేని ఇలాంటి చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. కూలి పనులు చేసుకొని బతుకే భారంగా గడుపుతున్న తల్లిదండ్రులకు ప్రతిరోజు ప్రయాణ ఛార్జీలు చెల్లించి పిల్లలకు పాఠశాలలకు పంపడం ఇబ్బందిగా మారుతోంది. దీంతో ప్రభుత్వం విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రయాణ భత్యం ఇస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులు.. ప్రయాణ భత్యాన్ని పొందేందుకు ఒక కిలోమీటరు దూరం ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు, మూడు కిలోమీటర్లు దూరంగా ప్రాథమికోన్నత విద్యార్థులు, ఐదు కిలోమీటర్లు దూరంగా వెళ్లి చదివే ఉన్నత స్థాయి విద్యార్థులు అర్హులు. 1-5 తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ.4 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల వారికి రూ.6 వేలు చెల్లించాలి. ఏడాదిలో పది నెలలకు మాత్రమే ఈ భత్యాన్ని అందిస్తారు. అర్హత గల విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలను సమగ్ర శిక్షా అభియాన్‌కు అందిస్తే విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపితే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 86,238 మంది విద్యార్థులు చదువుతుండగా ఇందులో 2022-23 విద్యా సంవత్సరానికి 1224 మంది విద్యార్థులకు రూ.67.86 లక్షలు, 2023-24 విద్యా సంవత్సరానికి 1144 మంది విద్యార్థులకు రూ.63.58 లక్షలు విడుదల కావాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 23తో విద్యా సంవత్సరం ముగియనుండగా ఇప్పటికీ గతేడాది, ఈ ఏడాదికి సంబంధించిన రవాణా భత్యం విడుదల కాలేదు. విద్యా సంవత్సరం ముగియనుండటంతో ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. రెండేళ్లుగా విద్యార్థులకు భత్యం విడుదల కాకపోవడం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం: జ్యోతి, సెక్టోరియల్‌ అధికారి

గత రెండేళ్లుగా విద్యార్థులకు రావాల్సిన రవాణా భత్యం పెండింగ్‌లో ఉంది. వీటిపై ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల వివరాలు పాఠశాలల హెచ్‌ఎంలు సకాలంలో అందించడం లేదు. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడతాయి.

బ్యాంకు ఖాతాల సేకరణలో జాప్యం

ఈ ఏడాది 1144 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు. ఇందులో సుమారు 700 మంది విద్యార్థులకు సంబంధించి బ్యాంకు ఖాతాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమగ్ర శిక్షా అభియాన్‌ అధికారులకు పంపలేదు. విద్యాశాఖ నుంచి విద్యార్థులకు భత్యం విడుదలై బ్యాంకు వివరాలు లేకపోతే వారి ఖాతాల్లో జమకావు. దీంతో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దీనిపై పాఠశాలల హెచ్‌ఎంలు చొరవ తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని