logo

ఆరుగాలం కష్టం.. అకాల వర్షంతో నష్టం

అకాల వర్షంతో అన్నదాత కుదేలవుతున్నాడు. ఎప్పుడు పడుతుందో తెలియని వర్షంతో కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

Published : 21 Apr 2024 01:16 IST

ఇబ్రహీంపూర్‌ వద్ద రోడ్డుపై కొట్టుకుపోయిన ధాన్యం

నిజాంపేట(రామాయంపేట), అల్లాదుర్గం, చేగుంట, న్యూస్‌టుడే: అకాల వర్షంతో అన్నదాత కుదేలవుతున్నాడు. ఎప్పుడు పడుతుందో తెలియని వర్షంతో కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం వర్షం కురిసింది. దీంతో  కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంపై టార్పాలిన్లు కప్పినా.. ధాన్యం తడిసిపోయింది. కల్వకుంట కొనుగోలు కేంద్రంలో ధాన్యం సమీపంలోకి నీరు రావడంతో కాపాడుకోవడానికి రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు.

అల్లాదుర్గంలో 26 మి.మీ.లు: అల్లాదుర్గం మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం 26 మిమీ వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌ శనివారం తెలిపారు. మాందాపూర్‌, వెంకట్‌రావుపేట్‌, గడిపెద్దాపూర్‌ గ్రామాల్లో గాలి బీభత్సానికి చెట్లు విరిగిపోయాయి. కొమ్మలు విద్యుత్తు తీగలపై పడడంతో గడిపెద్దాపూర్‌లో రెండు విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. మామిడి కాయలు రాలిపోయాయి. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు విరిగి పొలాల్లో పడటంతో సరిచేయలేక పోయినట్లు లైన్‌మెన్‌ నవాజ్‌ తెలిపారు.

గడిపెద్దాపూర్‌లో రాలిపోయిన మామిడి

తడిసిన ధాన్యం: చేగుంట మండలం రుక్మాపూర్‌, ఇబ్రహీంపూర్‌, బోనాల, బి.కొండాపూర్‌ గ్రామాల్లో రహదారులపై ఎండబెట్టిన ధాన్యం తడిసింది. పలుచోట్ల వరదకు ధాన్యం రోడ్ల కిందికి కొట్టుకుపోయింది. టార్పాలిన్లు కప్పినా కింది నుంచి నీరు వెళ్లడంతో తడిసిపోయింది. నార్సింగిలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని