logo

రైతులు అసంతృప్తితో ఉన్నారు

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు ఆందోళన, అసంతృప్తితో ఉన్నారని.. నాలుగు నెలలకే పెదవి విరుస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

Published : 21 Apr 2024 01:17 IST

మాజీ మంత్రి,  ఎమ్మెల్యే హరీశ్‌రావు 

ప్రజ్ఞాపూర్‌లో అమ్మవారి ప్రతిష్ఠాపనలో హరీశ్‌రావు, నాయకులు

దుబ్బాక, గజ్వేల్‌, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు ఆందోళన, అసంతృప్తితో ఉన్నారని.. నాలుగు నెలలకే పెదవి విరుస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామం పోతారంలోని ఆయన నివాసంలో శనివారం హరీశ్‌రావు ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ నాయకులతో అంతర్గత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, భారాస మెదక్‌ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డి, నాయకురాలు కత్తి కార్తీక, బక్కి వెంకటయ్య, ఫారుఖ్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, అక్బర్‌పేట-భూంపల్లి, రాయిపోల్‌, దౌల్తాబాద్‌, చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన ముఖ్య భారాస నాయకులు, కార్యకర్తలతో విడతల వారీగా అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి గెలుపునకు ఏ విధంగా కష్టపడ్డారో, అదే విధంగా భారాస ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని హరీశ్‌రావు సూచించారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీ హామీల అమలులో తీవ్ర జాప్యం వంటి అంశాలను, గత భారాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను స్థానిక నాయకులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. మెదక్‌ గడ్డపై గెలిపించి మాజీ సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందించాలని నాయకులకు చెప్పినట్లు సమాచారం. గంభీర్‌పూర్‌ గ్రామంలో భారాస నాయకుడు కె.ఆర్‌.భీమసేన తండ్రి రాజయ్య మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా హరీశ్‌రావు, ప్రభాకర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అదే గ్రామంలో వారం క్రితం ఆత్మహత్య చేసుకున్న భారాస కార్యకర్త నీరటి రాజశేఖర్‌ కుటుంబాన్ని ఓదార్చారు.

 విగ్రహాల ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తున్న గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌లోని నల్లపొచమ్మ-ముత్యాలమ్మ దేవతా మూర్తులను మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. అనంతరావుపల్లిలో నిర్వహిస్తున్న బొడ్రాయి పండుగ సందర్భంగా పూజలు చేశారు. వెంకట్రామిరెడ్డి, యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాజమౌళి, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు