logo

మూడు రంగుల జెండా.. పేదలకు అండ

పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలబడింది మూడు రంగుల కాంగ్రెస్‌ జెండానేనని, దీనిని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరగదని, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 21 Apr 2024 06:53 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి, నమస్కరిస్తున్న ఎంపీ అభ్యర్థి నీలం మధు

న్యూస్‌టుడే,మెదక్‌, మెదక్‌ అర్బన్‌, మెదక్‌ టౌన్‌: పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలబడింది మూడు రంగుల కాంగ్రెస్‌ జెండానేనని, దీనిని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరగదని, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శనివారం మెదక్‌ పట్టణం రాందాస్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్‌ సమావేశానికి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  ఏళ్లుగా భాజపా, భారాసకు ఓటు వేశారని, ఎన్నికల్లో ఇతర పార్టీలు ఇచ్చే నగదు, మద్యాన్ని తీసుకోకుండా, బడుగు బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి నీలం మధుకు ఓటు వేసి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికను ఛాలెంజ్‌గా తీసుకుని సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు ప్రజల ఓట్లు కాంగ్రెస్‌కే పడాలన్నారు. ఎవరు వచ్చినా, జిమ్మిక్కులు చేసినా ఊరుకునేది లేదని, ప్రభుత్వం మనదే ఉందని, పోలీసులకు భయపడవద్దన్నారు. ఇరవై ఐదేళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉందని, నీలం మధును గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ ఇందిరమ్మ పరిపాలించిన గడ్డమీద తనకు టికెట్‌ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అందరు దీవించి సేవచేసే భాగ్యం కల్పించాలని కోరారు. ఎంపీగా గెలిస్తే వారంలో ఒక రోజు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్‌లలో అందుబాటులో ఉంటానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

మెదక్‌ ప్రధాన రహదారిలో ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్‌, అభ్యర్థి నీలం మధు

సీఎం వేదికపైకి రాగానే..

సీఎం వేదిక వద్దకు చేరుకునే సమయానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సమావేశం వేదిక వద్ద మహిళలు ఉత్సాహంగా నృత్యం చేశారు. పటాన్‌చెరుకు చెందిన లక్ష్మణ్‌ పార్టీ జెండాతో స్కేటింగ్‌ చేశారు. మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, జగ్గారెడ్డి, మదన్‌రెడ్డి, మెదక్‌, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్‌, నర్సారెడ్డి, నర్సాపూర్‌, పటాన్‌చెరు, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ఆవుల రాజిరెడ్డి, కాటా శ్రీనివాస్‌గౌడ్‌, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, హరికృష్ణ, మెదక్‌ పురపాలిక అధ్యక్షుడు చంద్రపాల్‌, నాయకులు సుప్రభాత్‌రావు, సుహాసినిరెడ్డి, జీవన్‌రావు, సురేందర్‌గౌడ్‌, బొజ్జపవన్‌, ప్రశాంత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నరేందర్‌, మధుసూదన్‌రావు, రాజిరెడ్డి, శ్రీనివాస్‌చౌదరి, హఫీజుద్దీన్‌, మోహన్‌గౌడ్‌, రమేశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మహిళా కార్యకర్తల నృత్యం

భారీ ర్యాలీ.. శ్రేణుల్లో ఉత్సాహం

మెదక్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 11 గంటలకే రాందాస్‌చౌరస్తా వద్దకు శ్రేణులు తరలివచ్చారు. మధ్యాహ్నం 1.15 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో మెదక్‌కు చేరుకున్నారు. అనంతరం శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించగా, వారి వెనకాల ఓపెన్‌ టాప్‌ వాహనంపై సీఎం, మంత్రులు, ఎంపీ అభ్యర్థి నీలం మధు నిల్చోని కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. దారి వెంట కార్యకర్తలు, ప్రజలకు సీఎం అభివాదం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌లో ప్రచారం చేసిన విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ జెండాతో స్కేటింగ్‌ చేస్తున్న లక్ష్మణ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని